WTC Points Table Team India Position : తాజాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్‌కు ఎదురైన ఓటమి ఇప్పుడు WTCలో మూడోసారి ఫైనల్‌కు చేరుకుందామనే ఆశలకు గండికొట్టేలా అనిపిస్తోంది. ఈ సిరీస్ ముందు వరకూ ఈ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోన్న టీమ్‌ఇండియా ఇప్పుడు ఈ ఓటమి వల్ల రెండో స్థానానికి దిగజారిపోయింది. దీంతో 62.50 శాతంతో ఆస్ట్రేలియా తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక 58.33 శాతంతో భారత్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. వీరి తర్వాత శ్రీలంక 55.56 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. ఈ టెస్టు సిరీస్ గెలుపుతో కివీస్ 54.55 శాతంతో నాలుగో పొజిషన్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఐదవ స్థానాన్ని సౌతాఫ్రికా 54.17 శాతంతో చేరుకుంది.
ఆ టూర్ భారత్‌కు వెరీ ఇంపార్టెంట్ :
వరుసగా మూడు టెస్టుల్లో ఓటమి, ఇతర జట్లూ ముందుకు దూసుకురావడం వల్ల భారత్‌కు ఈ సారి కఠిన సవాళ్లు ఎదురవ్వనుంది. అయితే బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమ్‌ఇండియా ఆసీస్‌తో ఐదు టెస్టుల్లో తలపడనుంది. WTC సైకిల్‌లో భారత్‌కు ఇదే చివరి సిరీస్ కూడా. ఈ క్రమంలో కనీసం 4 టెస్టుల్లో గెలిచి, మరొక దానిని డ్రాగా ముగించినా, లేకుంటే ఒక్కటి ఓడినా కూడా WTC ఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారడం ఖాయమని క్రికెట్ విశ్లేషకుల మాట.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, సొంత గడ్డపై టీమ్ఇండియా ఘోర పరాభవం మూటగట్టుకుంది. న్యూజిలాండ్‌తో మూడో టెస్టులోనూ ఓడి, స్వదేశంలో టెస్టుల్లో తొలిసారి వైట్‌వాష్‌కు గురైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 121 పరుగులకే కుప్పకూలింది. రిషభ్ పంత్ (64 పరుగులు) మినహా ఎవరూ రాణించలేదు. దీంతో భారత్ 25 పరుగుల తేడాతో ఓడింది. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ 6, గ్లెన్ ఫిలిప్ 3, మ్యాట్ హెన్రీ 1 వికెట్ పడగొట్టారు. కాగా, తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన కివీస్ తాజా విజయంతో 3-0తో ఈ సిరీస్ దక్కించుకుంది.
లక్ష్యం చిన్నదే అయినప్పటికీ పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరించడం వల్ల పరుగులు రావడం కష్టమైంది. ఇన్నింగ్స్ ప్రారంభంలో కెప్టెన్ రోహిత్ శర్మ (11 పరుగులు) రెండు ఫోర్లు బాది ఊపుమీద కనిపించాడు. ఇక బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టే క్రమంలో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 13 పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత శుభ్‌మన్ గిల్ (1) బంతిని అంచనా వేయడంలో విఫలమై క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కాసేపటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (1 పరుగు), యశస్వీ జెస్వాల్ (5), సర్ఫరాజ్ ఖాన్ (1) పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో భారత్ 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.