Paris Olympics 2024 Indian Archery Team Ankita Bhakat :రేపు జులై 26న 2024 పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం జరగనుంది. అయితే ఒకరోజు ముందుగానే అంకితా భకత్, ఒలింపిక్స్‌లో ఇండియా జర్నీకి అద్భుత ప్రారంభం అందించింది. 26 ఏళ్ల అంకితా భకత్, ఉమెన్స్ ఆర్చరీలో భారత్ నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించింది. గురువారం జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో ముగ్గురు భారత మహిళా ఆర్చర్లు అదరగొట్టారు.
ఈ ఈవెంట్‌లో భారతీయ ఆర్చర్లలో భకత్ 666 పాయింట్లతో 11వ స్థానంలో నిలిచింది. భజన్ కౌర్ (659 పాయింట్లతో 22వ స్థానం), మాజీ ప్రపంచ నం.1 దీపికా కుమారి (658 పాయింట్లతో 23వ స్థానం)లో నిలిచారు. అయితే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఈ అంకితా భకత్ ఎవరు? ఆమె గురించి తెలుసుకుందాం.
- ఒలింపిక్స్‌కి ముందు అంకిత్ భకత్ ప్రదర్శన
2024 పారిస్ ఒలింపిక్స్ ముందు, 2023 ఆసియా క్రీడల్లో మహిళల టీమ్ రికర్వ్ ఈవెంట్‌లో అంకిత కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె సిమ్రంజీత్ కౌర్, భజన్ కౌర్ ఉన్న జట్టులో సభ్యురాలు. ఈ విజయం తర్వాత టర్కీలోని అంటాల్యలో జరిగిన ప్రపంచ ఆర్చరీ ఒలింపిక్ క్వాలిఫైయర్ 2024లోనూ అంకిత మరోసారి తన సత్తా చూపింది. కానీ చివరకు క్వార్టర్ ఫైనల్స్‌లో ఇరాన్‌కు చెందిన మొబినా ఫల్లా చేతిలో ఓడిపోయింది.
- పదేళ్లకే మొదలైన శిక్షణ
అంకిత భకత్, 10 సంవత్సరాల వయస్సులోనే కోల్‌కతా ఆర్చరీ క్లబ్‌లో చేరడంతో ఆర్చరీలో తన ప్రయాణం ప్రారంభించింది. అనంతరం జంషెడ్‌పూర్‌లోని ఆర్చరీ అకాడమీలో చేరింది. అక్కడ ఆమె తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. - సెమీఫైనల్లో బలమైన దక్షిణ కొరియాతో ఢీ?
జులై 28న జరగనున్న క్వార్టర్స్ ఫైనల్స్‌లో భారత్, ఫ్రాన్స్ లేదా నెదర్లాండ్స్‌తో తలపడనుంది. క్వార్టర్స్‌లో గెలిస్తే సెమీ ఫైనల్‌లో టాప్ సీడ్, బలమైన దక్షిణాకొరియాతో తలపడే అవకాశముంది.
- దక్షిణ కొరియా మహిళల జట్టు ఒలింపిక్స్‌లో బలమైన జట్టుగా ఎదిగింది. ఇప్పటి వరకు ఒలింపిక్స్ చరిత్రలో ఆర్చరీలో 27 బంగారు పతకాలు సాధించింది. వ్యక్తిగత విభాగంలో, కొరియాకు చెందిన లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు స్కోరు 694తో అగ్రస్థానంలో నిలిచింది. కొరియాకే చెందిన సుహియోన్ నామ్ 688 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.