Vinesh Phogat Paris Olympics :పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతకు గురైన వినేశ్ ఫొగాట్ ఫైనల్ ముందు రోజు రాత్రి బరువు తగ్గించేందుకు చేసిన ప్రయత్నాల గురించి ఆమె కోచ్ వోలర్ అకోస్ చెప్పారు. బరువు తగ్గించే ప్రక్రియలో ఆమె తీవ్రంగా శ్రమించిందని చెప్పిన అకోస్, ఓ దశలో ఆమె ప్రాణాల గురించి భయపడ్డామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వినేశ్ బరువు తగ్గించే ప్రక్రియలో ఆ రోజు టీమ్‌లోని ప్రతి సభ్యుడు ప్రయత్నించారని చెప్పుకొచ్చారు.
'వినేశ్ సెమీఫైనల్ తర్వాత 2.7 కిలోల బరువు ఎక్కువగా ఉంది. దీంతో మేం బరువు తగ్గే ప్రక్రియ ప్రారంభించాం. తొలుత 1 గంట 20 నిమిషాలు వ్యాయామం చేయించాం. అప్పుడు 1.2కేజీలు తగ్గింది. అప్పటికీ ఇంకా 1.5కేజీలు అదనంగా ఉంది. ఇక 50 నిమిషాల ఆవిరి స్నానం తర్వాత ఆమె శరీరంపై చెమట చుక్క కూడా కనిపించలేదు. అర్ధరాత్రి నుంచి ఉదయం 5:30 దాకా ఆమె వేర్వేరు సాధనలు చేసింది. దీంతో ఓపిక క్షీణించి ఆమె కింద పడిపోయింది. అయినప్పటికీ మళ్లీ ఆమెను పైకి లేపి సాధన చేయించాం. కానీ, ఆ సమయంలో తన ప్రాణాలకు ప్రమాదం జరుగుతుందేమో అనిపించింది' అని అకోస్ తన హంగేరీ భాషలో ట్వీట్లో రాసుకొచ్చాడు. అయితే తర్వాత అకోస్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు.
అయితే ఆ రాత్రి హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి కూడా అకోస్ వివరించారు. 'కోచ్ మీరెం బాధపడకండి. నేను వరల్డ్ నెం.1 రెజ్లర్ (సుసాకీ)ని ఓడించాను. ఈ గెలుపుతో నా లక్ష్యాన్ని సాధించినట్లే. ప్రపంచంలో అత్యత్తమ రెజ్లర్‌గా నన్ను నేను నిరూపించుకున్నాను. పతకాలు కేవలం వస్తువులే. ప్రదర్శన ఎప్పటికీ నిలిచిపోతుంది' అని వినేశ్ తనతో చెప్పినట్లు తెలిపారు.