Vinesh Phogat Paris Olympics 2024 :పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు చేరుకుని పతకాన్ని ముద్దాడుతుందనుకున్న రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఊహించని షాక్ తగిలింది. అధిక బరువు కారణంగా ఫైనల్‌కు ముందే ఆమెపై అనర్హత వేటును విధించారు ఒలింపిక్స్ నిర్వాహకులు.
"రెజ్లింగ్ 50 కేజీల విభాగం నుంచి వినేశ్ ఫొగాట్ అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడం వల్ల ఆమెపై ఈ వేటు పడింది. దయచేసి వినేశ్ ప్రైవసీకి భంగం కలగించకుండా ప్రవర్తించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్తను పంచుకోవడం అత్యంత బాధాకరంగా ఉంది" అంటూ భారత ఒలింపిక్ సంఘం తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది.
గోల్డ్ మెడల్ ఎవరికంటే?
ఈ పోటీల్లో వినేశ్‌పై అనర్హత వేటు పడినందున ఆమెకు ఎటువంటి పతకం ఇవ్వరని సమాచారం. అయితే ఆమెతో పాటు ఫైనల్లో ఉన్న అమెరికా క్రీడాకారిణి సారా హిల్డెబ్రాండ్‌కు మాత్రం ఆఖరి పోరులో పాల్గొనకుండానే బంగారు పతకాన్ని అందజేస్తారు. సిల్వర్ మెడల్‌ను మాత్రం ఎవరికీ కేటాయించకుండా అలాగే వదిలేస్తారు. ఇక కాంస్య పతక పోటీలు లాంఛనంగా జరుగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రకటించింది.
ఒలింపిక్స్‌కు ఐఓఏ ఛాలెంజ్
అయితేవినేశ్ ఫొగాట్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఐఓఏ వారిపై సవాల్ చేసేందుకు సిద్ధమైంది. ఒలింపిక్ అసోసియేషన్ నిబంధనల మేరకు, పోటీ జరిగే రోజున బరువుతోపాటు వైద్య పరీక్షలు నిర్వహించడం కామనే. అయితే, మంగళవారం రాత్రి సెమీస్ పోరులో తలపడినప్పుడు లేని ఫొగాట్ బరువు బుధవారం ఉదయానికల్లా పెరగడంపైనా కూడా ఐవోఏ అనుమానాలను వ్యక్తం చేస్తోంది. ఒకవేళ నిర్ణయంపై ఒలింపిక్ కమిటీ పునఃసమీక్ష లేకుంటే మాత్రం ఫొగాట్‌పై అనర్హత వేటు కొనసాగుతుంది. అప్పుడు అమె స్వదేశానికి తిరిగిరాకతప్పదని క్రీడా వర్గాల మాట.