Paris Olympics 2024 Opening Ceremony : ప్రపంచం మొత్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పారిస్ ఒలింపిక్స్ 2024 ఓపెనింగ్ సెర్మనీ ప్రేక్షకుల కేరింతల నడుమ ఎంతో అంగరంగ వైభవంగా సాగింది. చారిత్రక కట్టడాల మధ్యలో నుంచి ఉరకలెత్తే సెన్ నదిపై ఈ పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి ఈ ఫ్రాన్స్ సెన్ నదిలో ఆరంభ వేడుకలు జరిగాయి. ఈ ప్రారంభోత్సవ సంబరాల్లో ప్రతీ ఘట్టం ఎంతో ప్రత్యేకంగా ఘనంగా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు.
ఓ వైపు ఒలింపిక్ జ్యోతి ప్రయాణం, మరోవైపు వర్చువల్ టెక్నాలజీ మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శనలు, ఇంకోవైపు వేలాది మంది అథ్లెట్లతో సాగిన బోటు ప్రయాణం. చూడటానికి రెండు కళ్లు చాలనంత ఘనంగా సాగింది. ఒక్క మాటలో చెప్పాలంటే నభూతో అనే విధంగా సరికొత్త అనుభూతిని పంచింది పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు.
రికార్డ్ స్థాయిలో -సెన్ నదిపై 6 కిలోమీటర్ల పాటు పరేడ్ సాగింది. దాదాపు 85 పడవలపై 6800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ వేడుకలను చూసేందుకు దాదాపు 3,20,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరై సందడి చేశారు. ఒలింపిక్ చరిత్రలోనే ఇదే అత్యధికం. ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రమఖులు, దేశాధినేతలు, వేలాది మంది ప్రదర్శనకారులు హాజరై సందడి చేశారు. అలానే ఈ ఆరంభ వేడుకలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, వివిధ క్రీడల్లోని దిగ్గజ అథ్లెట్లు పాల్గొన్నారు.
సంప్రదాయ దుస్తుల్లో - ఈ పరేడ్‌లో భారత్ అథ్లెట్లు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, ఐదో ఒలింపిక్స్ ఆడబోతున్న టేబుల్ టెన్నిస్ లెజెండ్ శరత్ కమల్ ఈ ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి నాయకత్వం వహించారు. ఈ ఇద్దరు భారతదేశ పతాకధారులుగా వ్యవహరించారు. త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ముందు నిలబడ్డారు. వీళ్ల వెనకాలే మన అథ్లెట్ల పడవ ప్రయాణం సాగింది. వీరంతా సంప్రదాయ భారతీయ దుస్తుల్లో మెరిశారు. మహిళలు త్రివర్ణ పతాకంలోని రంగులతో కూడిన చీరను కట్టుకోగా, పురుషులు కుర్తా, పైజామాను ధరించి ఆకట్టుకున్నారు. మొత్తంగా భారత బృందం తరఫున 78 మంది అథ్లెట్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.