Paris Olympics 2024 javelin gold winner Arshad Nadeem career : ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా పసిడిని ముద్దాడుతాడని భావిస్తే ఆ గోల్డ్ మెడల్‌ను పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఎగరేసుకుపోయాడు. ఏకంగా 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి స్వర్ణం సాధించాడు. ఒలింపిక్స్ చరిత్రలో ఇదో సెన్సేషనల్ రికార్డ్. 40 ఏళ్లుగా పాక్ దేశం ఎదురుచూస్తున్న ఒలింపిక్ పసిడిని అందించాడు. దీంతో అర్షద్ ఎవరా? అని క్రీడాభిమానులు ఆరా తీయడం ప్రారంభించారు. అతడి గురించే ఈ కథనం.
పేద కుటంబం, తిండి కూడా లేకుండా - అర్షద్ నదీమ్ మియా చాను దగ్గర్లోని ఖనేవాల్ అనే గ్రామంలో జన్మించాడు. 1997 జనవరి 2న జన్మించాడు. ఇతడిది పేద కుటుంబం. ఇతడి తండ్రి మహమ్మద్ అష్రాఫ్ కూలి. ఈయనకు మొత్తం ఏడుగురు సంతానం. వీరిలో నదీమ్ మూడోవాడు.
అయితే నదీమ్ కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అతడికి అవసరమైన డైట్ కూడా దొరికేది కాదట. కేవలం ఈద్ అల్ అదా నాడు మాత్రమే వారి కుటుంబం మాంసాహారం తినేదట. అంటే ఏడాదిలో ఒక్కసారి మాత్రమే. ఆర్థిక పరిస్థితి అంత దారుణంగా ఉండేదట.
కోచ్ గుర్తించడంతో అథ్లెటిక్స్‌లోకి - నదీమ్ చిన్నప్పటి నుంచి గేమ్స్‌లో చురుగ్గా పాల్గొనేవాడు. స్కూల్లో క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్ వంటి బాగా ఆడేవాడు. క్రికెట్‌లో అయితే జిల్లా స్థాయిలో టోర్నమెంట్లు ఆడాడు. మంచి బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే వాటన్నింటిని మించి అథ్లెటిక్స్‌లో బాగా రాణించాడు నదీమ్. దీన్ని కోచ్ రషీద్ అహ్మద్ సాకీ గుర్తించాడు. దీంతో అతడిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాడు.
గోల్డ్ మెడల్స్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు - అయితే నదీమ్ జావెలిన్ త్రో కన్నా ముందు షాట్‌పుట్, డిస్కస్ త్రోను ట్రై చేశాడు. కానీ ఆ తర్వాత జావెలిన్‌త్రోలో మంచిగా రాణించడం ప్రారంభించాడు. ఈ జావెలిన్ త్రోలో పంజాబ్ యూత్ ఫెస్టివల్స్, ఇంటర్ బోర్డ్ మీట్‌లో వరుసగా గోల్డ్ మెడల్స్‌ను సాధించాడు. దీంతో జాతీయ స్థాయిలో అతడికి గుర్తింపు వచ్చింది. ఆర్మీ, డబ్ల్యూపీడీఏ, ఎయిర్‌ఫోర్స్ నుంచి ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ ఆర్మి ఆఫర్‌ను నదీమ్ సోదరుడు తిరస్కరించాడు. జావెలిన్ త్రోను లక్ష్యంగా ఎంచుకోవడంలో అతనికి తండ్రి కూడా ఎంతో సాయం చేశాడట.
అలా మొదలైన జావెలిన్ కెరీర్ - నదీమ్ తన జావెలిన్ కెరీర్‌ను 2015లో ప్రారంభించాడు. ఆ తర్వాతి ఏడాదే వరల్డ్ అథ్లెటిక్స్ తరఫున స్కాలర్ షిప్ సంపాదించాడు. అయినా అతడి కెరీర్ అంత సాఫీగా ఏమీ సాగలేదు. ఎన్నో సార్లు గాయాల బారిన పడ్డాడు. సొంత దేశం అయి కూడా పాకిస్థాన్ అతడికి స్కాలర్‌షిప్ ఇవ్వలేకపోయింది.