Paris Olympics 2024 Manu Bhaker Prize Money :పారిస్ ఒలింపిక్స్ 2024లో మను బాకర్ పతక మోత మోగించింది. అయితే రెండు కాంస్య పతకాలు సాధించిన మను బాకర్‌కు ఎంత ప్రైజ్ మనీ దక్కుతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సరబ్‌జోత్‌కు కూడా ఏమైనా ప్రైజ్ మనీ ఇస్తారా లేదా అని చాలామంది చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పారిస్ ఒలింపిక్స్ 2024లో పతకం సాధించిన మను భాకర్‌తో పాటు ఇతర భారతీయ విజేతలకు ఎంత ప్రైజ్ మనీ ఇస్తారో తెలుసుకుందాం.
మను బాకర్‌కు ఎంతిస్తారు(Paris Olympics 2024 Prize Money)? - మను భాకర్ పారిస్ 2024 ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు అందించింది. ఇండియాకు ఒలింపిక్ షూటింగ్ పతకాన్ని అందించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. అయితే ఒలింపిక్ విజేతలుగా నిలిచిన వాళ్లు తమ జీవితంలో చూడలేనంత డబ్బు చూస్తారని చాలా మంది అనుకుంటారు. కానీ మెడల్స్ గెలిచిన వారికి ఒలింపిక్ నిర్వహక కమిటీ ఒక్క డాలర్ కూడా ఇవ్వదు. బంగారు, రజతం, కాంస్య పతకాన్ని గెలిచిన వారికి ఆర్థిక రివార్డులు ఏం రావు. అయితే ఒలింపిక్ కమిటీ ఎలాంటి నగదు ఇవ్వదు కానీ - పతకం గెలిచిన వారికి, వారు ప్రాతినిథ్యం వహిస్తున్న దేశాలు ప్రోత్సాహకంగా ప్రైజ్‌మనీని అందిస్తాయి. ఈ ఒలింపిక్స్‌లో ఒక్క పతకం సాధించిన భారత్‌లో ఆ అథ్లెట్లు హీరోగా మారిపోతారు. వారికి రివార్డ్ కూడా ఇస్తారు.
టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన అథ్లెట్లకు దక్కిన రివార్డులు
నీరజ్ చోప్రా : గోల్డ్ మెడల్ - రూ. 6 కోట్లు
రవి కుమార్ దహియా : రజతం, రూ. 4 కోట్లు
మీరాబాయి చాను : రజతం, రూ.కోటి
లవ్లీనా బోర్గోహైన్ : కాంస్యం, రూ.కోటి
పీవీ సింధు : కాంస్యం, రూ. 30 లక్షలు
బజరంగ్ పునియా : కాంస్యం, రెజ్లింగ్ - రూ. 25 లక్షలు
ఈ నగదు బహుమతిని సదరు అథ్లెట్లు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించాయి. ఇవి కాక భారత కేంద్ర ప్రభుత్వం కూడా నీరజ్ చోప్రాకు రూ. 75 లక్షలు, రజత పతక విజేతలు రవికుమార్ దహియా, మీరాబాయి చానులకు రూ. 50 లక్షలు, కాంస్య పతక విజేతలైన లవ్లీనా బోర్గోహైన్, పీవీ సింధు, బజరంగ్ పునియా, భారత హాకీ జట్టుకు రూ. 30 లక్షలు ప్రదానం చేసింది.