Paris Olympics 2024 Hockey : పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ టీమ్ శుభారంభం చేసింది. శనివారం (జులై 27)న జరిగిన తొలి పోరులో 3-2తో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. మన ప్లేయర్లలో వివేక్ సాగర్, హర్మన్‌ప్రీత్ సింగ్, మన్‌దీప్ సింగ్ గోల్స్ చేయగా, న్యూజిలాండ్ జట్టులో సైమన్ చైల్డ్, సామ్‌లేన్ తమ జట్లకు గోల్స్ అందించారు. మ్యాచ్ ఆఖరి నిమిషంలో దక్కిన పెనాల్టీ స్ట్రోక్‌ను హర్మన్‌ప్రీత్‌సింగ్ గోల్‌గా మలిచి జట్టును గెలిపించాడు.
మ్యాచ్ సాగిందిలా
మ్యాచ్ ప్రారంభంలో న్యూజిలాండ్ జట్టు దూకుడుగా ఆడింది. ఆట 8వ నిమిషంలో సామన్ లేన్ ఓ సూపర్ గోల్‌తో తమ పాయింట్ల ఖాతా తెరిచాడు. అలా తొలి క్వార్టర్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంతో టాప్‌లో చేరుకుంది. అయితే రెండో క్వార్టర్‌లోని 24వ నిమిషంలో దక్కిన పెనాల్టీని మన్‌దీప్ సింగ్ గోల్‌గా మలిచి స్కోర్‌ను సమం చేశాడు.
ఆ తర్వాత నుంచి ఎంత ప్రయత్నించినా కూడా ఇరు జట్లకు ఒక్క గోల్ కూడా దక్కలేదు. ఈ నేపథ్యంలో మొదటి క్వార్టర్‌ను 1-1తో ముగించాల్సి వచ్చింది. ఇక వివేక్ సాగర్ కొట్టిన గోల్‌తో 2-1 స్కోర్‌తో భారత్ మూడో క్వార్టర్‌లో ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత కివీస్ గోల్ కొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ, మన గోల్ కీపర్ శ్రీజేష్ వాటిని అడ్డుకుంటూ వచ్చాడు. అలా 2-1 ఆధిక్యంతో మూడో క్వార్టర్ పూర్తైంది.
అయితే ఆట 46వ నిమిషంలో భారత్ చేసిన గోల్‌ను న్యూజిలాండ్ అనుహ్యంగా అడ్డుకుంది. 53వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి న్యూజిలాండ్ జట్టు స్కోర్లను మరోసారి సమం చేసింది. ఇలా సమాన స్కోర్లతో మ్యాచ్‌లో ఎవరిది పైచేయి కానుందన్న ఉత్కంఠత మొదలవ్వగా, ఆఖరి నిమిషంలో హర్మన్‌ప్రీత్ కౌర్ కొట్టిన గోల్ వల్ల భారత్ ఈ మ్యాచ్‌లో విజయతీరాలకు చేరుకుంది. ఇక ఇదే జోష్తోభారత్ సోమవారం (జులై 29)న అర్జెంటీనాతో తలపడనుంది.