Strangest Sports In Olympic History :అతి పెద్ద అంతర్జాతీయ క్రీడా సంబరమైన ఒలింపిక్స్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. 84 దేశాల నుంచి 10,000 మంది అథ్లెట్లు ఈ విశ్వ క్రీడలలో పాల్గొంటారు. ఇందులో మొత్తం క్రీడలు 32 ఉండగా మనకు ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్ , షూటింగ్ వంటివి బాగా తెలుసు. అయితే విశ్వ క్రీడల్లో ఒకప్పుడు కొన్ని ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన క్రీడలు ఉన్నాయని మీకు తెలుసా. అవేంటో ఒకసారి చూద్దాం.
200 మీటర్ల అబ్స్టాకిల్ రేస్
1900లో పారిస్‌లో వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో ఈ ఈవెంట్‌ను ప్రవేశపెట్టారు. ఈ స్విమ్మింగ్ ఈవెంట్ చాలా క్లిష్టంగానూ అలాగే సరదాగానూ ఉంటుంది. 200మీటర్ల అబ్స్టాకిల్ రేస్‌లో అడ్డంకులు దాటుకుంటూ ఈత కొడుతూ లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. పోటీ దారులు ఒక స్తంభంపైకి ఎక్కి, పడవల వరుసపై దూకి ఈత కొట్టి లక్ష్యాన్ని వేగంగా చేరుకోవాలి. ఈ నేపథ్యంలో స్విమ్మర్లు మూడు సెట్ల అడ్డంకులను అధిగమించి 200 మీటర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సోలో సిన్క్రనైజ్డ్ స్విమ్మింగ్
డ్యాన్స్ చేసినట్లు ఈత కొట్టడమే సోలో సిన్క్రనైజ్డ్ స్విమ్మింగ్. 1984, 1992 మధ్య జరిగిన ఒలింపిక్ క్రీడల్లో ఈ సోలో సిన్క్రనైజ్డ్ స్విమ్మింగ్ ఈవెంట్ నిర్వహించారు. సంగీతానికి తగ్గట్లు కళాత్మకంగా ఈత కొట్టినవారికి పతకం దక్కుతుంది. అమెరికా స్విమ్మర్ ట్రేసీ రూయిజ్ ఈ విభాగంలో 1984లో స్వర్ణం పతకాన్ని గెలుచుకున్నారు.
రోప్ క్లైంబింగ్:
1896, 1900-08,1924, 1932 ఒలింపిక్స్ క్రీడల్లో ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. 1859లో హెలెనిక్ ఒలింపిక్స్‌లోనూ ఈ పోటీలు జరిగాయి. 1932 వరకు ఒలింపిక్స్‌లోని జిమ్నాస్టిక్ ఈవెంట్లలో ఇదీ ఓ ఆటగా ఉండేది. మొదటి ఒలింపిక్ సమయంలో తాడు 14 మీటర్ల పొడవు ఉండేది. 1932 తర్వాత దీనిని ఒలింపిక్స్ నుంచి తొలగించారు.
ఓపెన్ క్లాస్ మోటర్ బోటింగ్
1908 సమ్మర్ ఒలింపిక్స్‌లో ఈ ఓపెన్ క్లాస్ మోటర్ బోటింగ్ ఈవెంట్‌ను నిర్వహించారు. చాలా కాలం పాటు వాయిదా వేసి ఆ తర్వాత ఈ రేస్ నిర్వహించారు. మూడు ఒలింపిక్స్‌లో ఈ ఈవెంట్ నిర్వహించారు. ఆ తర్వాత మోటర్‌బోటింగ్ మళ్లీ కనిపించలేదు. 1908లో ఈ పోటీ విన్నర్‌గా ఎమిలే థుబ్రోన్ నిలిచారు.