తెలంగాణ

telangana

భారత్ ఖాతాలో పతకం- సింధు శుభారంభం- సత్తాచాటిన షూటర్లు- డే 2 హైలైట్స్ ఇవే! - Paris Olympics 2024

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 10:43 PM IST

Paris Olympics 2024 Day 2 India: పారిస్ ఒలింపిక్స్​లో రెండో రోజు భారత్ ఖాతాలో పతకం వచ్చి చేరింది. మరికొందరు అథ్లెట్లు కూడా మెరుగైన ప్రదర్శనే కనబర్చారు. ఇక విశ్వ క్రీడల్లో రెండో హైలైట్స్ ఎంటో చూసేయండి.​

Paris Olympics 2024 Day 2
Paris Olympics 2024 Day 2 (Source: Associated Press, IANS (PV Sindhu))

Paris Olympics 2024 Day 2 India:పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. స్టార్ షూటర్ మనూ బాకర్ 10మీటర్ల ఎయిర్ పిస్టర్ ఈవెంట్లో కాంస్యం ముద్దాడింది. దీంతో ప్రస్తుత ఒలింపిక్స్​లో భారత్ ఖాతాలో తొలి పతకం వచ్చి చేరింది. ఇక ఆయా అథ్లెట్లు కూడా రెండో రోజు మెరుగైన ప్రదర్శన చేశారు. పలు క్రీడల్లో క్వాలిఫయర్, రౌండ్ ఈవెంట్లలో సత్తా చాటారు. రెండో రోజు భారత అథ్లెట్లు హైలైట్స్ ఇవే!

బ్యాడ్మింటన్
స్టార్ షట్లర్ పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్​లో శుభారంభం చేసింది. తొలిమ్యాచ్​లో మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి అబ్దుల్ రజాక్ పై 21-9, 21-6 తేడాతో అలవోక విజయం సాధించి తర్వాతి రౌండ్​కు అర్హత సాధించింది. జులై 31న క్రిస్టిన్ కుబ్బాతో పోటీ పడాల్సి ఉంది. మరోవైపు పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్​లో ఎస్ ప్రణయ్ కూడా శుభారంభం చేశాడు. అతడు జర్మనీ షట్లర్ ఫాబియన్ రోత్​పై 21-18, 21-12 తేడాతో నెగ్గాడు. ఇక 31 జులైన ప్రణయ్ తదుపరి మ్యాచ్ ఆడనున్నాడు.

షూటింగ్
పారిస్‌ ఒలింపిక్స్‌లో తొలిరోజు నిరాశపరిచిన భారత షూటర్లు రెండోరోజు సత్తా చాటారు. పురుషుల 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో అర్జున్ బబుతా ఫైనల్‌కు చేరాడు. 630.1 పాయింట్లతో ఏడోస్థానంలో నిలిచి తుదిపోరుకు అర్హత సాధించాడు. మరో యువ షూటర్‌ రమితా జిందాల్ పతకానికి గురిపెట్టింది. మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్​లో ఫైనల్​కు దూసుకెళ్లింది. 631.5 పాయింట్లతో రమిత ఐదోస్థానంలో నిలిచి ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. ఇదే ఈవెంట్‌లో స్టార్ షూటర్ ఇలవెనిల్ వలరివన్ 630.7పాయింట్లతో పదో స్థానంలో నిలిచి ఫైనల్​కు చేరడంలో విఫలమైంది.

స్విమ్మింగ్
అటు స్విమ్మింగ్‌ వంద మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ హీట్స్‌ విభాగంలో భారత్‌ స్విమ్మర్‌ శ్రీహరి నటరాజ్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. 55.01 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఇక రోయింగ్​లో రిపెఛేజ్ విభాగంలో భారత అథ్లెట్ బాల్ రాజ్ పన్వార్ సత్తా చాటాడు. రెండోరౌండ్ లో అద్భుత ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. 7నిమిషాల 12.41 సెకన్లలో పూర్తిచేసి రెండో స్థానంలో నిలిచాడు.

బాక్సింగ్
మరోవైపు తొలిసారి ఒలింపిక్స్‌ బరిలోకి దిగిన స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ శుభారంభం చేసింది. మహిళల 50 కేజీల విభాగంలో జర్మనీ బాక్సర్‌ మ్యాక్సీ కరీనాను 5-0 తేడాతో ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

టేబుల్‌ టెన్నిస్‌
టేబుల్‌ టెన్నిస్‌ మహిళల విభాగంలో తెలుగుతేజం ఆకుల శ్రీజ స్వీడన్‌ క్రీడాకారిణి క్రిస్టిన్‌ కల్బర్గ్‌పై గెలుపొంది రౌండ్‌ 32కు అర్హత సాధించింది. మరోవైపు, ఇదే ఈవెంట్లో మనికా బాత్ర కూడా సంచలనం సృష్టించింది. రౌండ్ 64లో ప్రత్యర్థి అన్నా హర్సీపై నెగ్గి, రౌండ్ 32కు అర్హత సాధించింది.

ఇక పురుషుల టెన్నిస్ సింగిల్స్​లో సుమిత్ నగల్ పోరాడి ఓడాడు. తొలి మ్యాచ్​లో ఫ్రాన్స్​ అథ్లెట్ కొరింటీన్ మౌటెట్​ను ఎదుర్కొన్న సుమిత్ 6-2, 2-6, 7-5 తేడాతో ఓడాడు. మరోవైపు ఆర్చరీ టీమ్ విభాగంలో భకత్, భజన్, దీపికా త్రయం క్వార్టర్ ఫైనల్​లో నిరాశ పర్చింది. నెదర్లాండ్స్​తో పోటీపడిన ఈ టీమ్ ఓడింది.

12ఏళ్ల నిరీక్షణకు తెర- తొలి మహిళగా మను రికార్డు- ముర్ము, మోదీ హర్షం - Olympics 2024

సత్తాచాటిన తెలుగమ్మాయి శ్రీజ- షూటింగ్​లో ఫైనల్​కు రమితా జిందాల్ - Paris Olympics 2024

ABOUT THE AUTHOR

...view details