khairatabad Ganesh Got Huge Amount : నగరంలోని శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య హుండీ ఆదాయాన్ని నిర్వాహకులు లెక్కించారు. మొత్తం రూ.70 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో రూ.40 లక్షల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. తొలిసారిగా ఖైరతాబాద్‌లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీల లెక్కింపు చేపట్టారు. గత పదిరోజుల్లో నగదు రూపంలో ఈ ఆదాయం వచ్చినట్లు కమిటీ తెలిపింది.
మట్టితో చేసిన ఈ భారీ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మట్టి విగ్రహంగా నిలిచి భక్తులను మరింత ఆకట్టుకుంది. ఖైరతాబాద్ గణేశుడి ఎత్తు మాత్రమే కాదు, ఆకారమూ అత్యంత ప్రత్యేకమనే చెప్పాలి. గడిచిన 70 ఏళ్లుగా వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాడు ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య. 2014 నాటికి 60 అడుగుల ఎత్తుకు చేరిన గణపతి రూపాన్ని ఏటా ఒక అడుగు తగ్గించాలని కమిటీ నిర్వాహకులు భావించారు. అలా 2018 వరకు ఒక్కో అడుగు తగ్గిస్తూ 55 అడుగులకు తీసుకువచ్చారు. తిరిగి భక్తుల కోరిక మేరకు 2019లో అత్యధికంగా 61 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయటం విశేషం.
శోభాయాత్రకు సిద్ధమైన ఖైరతాబాద్ గణేశ్ : గతేడాది 63 అడుగుల వినాయకుడు ఖైరతాబాద్ భక్తులకు కనువిందు చేశాడు. ఇక ఈ ఏడాది 70 ఏళ్లను పురస్కరించుకుని ఏకంగా 70 అడుగుల ఎత్తులో శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం ఉదయం సుమారు 7 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం, సెన్సేషన్ థియేటర్ మీదుగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పక్క నుంచి ట్యాంక్ బండ్‌పైకి చేరుకోనున్నారు బొజ్జ గణపయ్య. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బాలాపూర్ వేలంపాటలో నిబంధనలు : మరోవైపు బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. తాజాగా వేలంపాట ప్రక్రియలో ఉత్సవ కమిటీ కొత్త నిబంధనను తెచ్చింది. లడ్డూ వేలంపాట పోటీదారులు ముందస్తుగా నగదు డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. గ్రామస్థుల నుంచి లడ్డూ వేలంపాటుకు తీవ్రమైన పోటీ ఉన్నందున ఈ నిబంధన తీసుకొచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. 2023లో బాలాపుర్ లడ్డూ రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు పలికింది. స్థానికేతరుడైన దాసరి దయానంద్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు ఈ ఏడాది రూ.30 లక్షలు పలుకుతుందని అంచనా వేస్తున్నారు.