Tasty and Spicy Coconut Chutney at Home:నవరాత్రులు ముగిశాయి. చాలా మంది ఇళ్లలో కొబ్బరి చిప్పలు మిగిలిపోయి ఉంటాయి. వాటితో చాలా మంది రొటీన్ పచ్చడి పెట్టుకుంటారు. మరికొద్దిమంది లడ్డూలు చేసుకుంటారు. ఈ సారి మూడు పప్పులు కలిపి అద్దిరిపోయే కొబ్బరి పచ్చడి తయారు చేసుకోండి. మేము చెప్పే పద్ధతిలో చేసుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుంది. అన్నం, ఇడ్లీ, దోశ.. ఎందులోకైనా టేస్ట్ అద్దిరిపోవాల్సిందే. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
కొబ్బరిపచ్చడికి కావాల్సిన పదార్థాలు:
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- ఎండు మిరపకాయలు - 25
- పచ్చిమిర్చి - 6
- పచ్చి శనగపప్పు - పావు కప్పు
- మినపప్పు - పావు కప్పు
- పెసరపప్పు - పావు కప్పు
- ధనియాలు - అర టేబుల్ స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 10
- పచ్చి కొబ్బరి ముక్కలు - ముప్పావు కప్పు
- జీలకర్ర - అర టీ స్పూన్
- బెల్లం - 1 టేబుల్ స్పూన్
- చింతపండు - నిమ్మకాయంత
- ఉప్పు - రుచికి సరిపడా
- నీరు - కప్పున్నర
ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు - 10 నిమిషాల్లోనే అద్దిరిపోయే "ఉల్లిపాయ పచ్చడి" ఇలా చేసేయండి!
తాళింపు కోసం:
- నూనె - 2 టేబుల్ స్పూన్
- ఆవాలు - 1 టీ స్పూన్
- జీలకర్ర - అర టీ స్పూన్
- ఎండు మిర్చి - 2
- పసుపు - పావు టీ స్పూన్
- కరివేపాకు రెబ్బలు - 2
- ఇంగువ - పావు టీ స్పూన్
తయారీ విధానం :
- ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఎండు మిర్చి, పచ్చిమిర్చి వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేయించుకుని తీసి పక్కకు పెట్టుకోవాలి.
- ఆ తర్వాత అదే పాన్లో పచ్చి శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు వేసి మంటను సిమ్లో పెట్టి మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి.
- పప్పులు కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వాటిని కూడా వేయించుకోవాలి.
- మొత్తంగా ఈ మిశ్రమం ఎర్రగా వేగడానికి 8 నుంచి 10 నిమిషాల టైమ్ పడుతుంది.
- ఆ తర్వాత అందులోకి పచ్చికొబ్బరి ముక్కలు వేసుకుని రెండు నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర వేసి మరో రెండు నిమిషాలు వేయించుకుని పక్కకు పెట్టి చల్లారనివ్వాలి.
- ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేయించి పక్కకు పెట్టుకున్న ఎండు మిర్చి, పచ్చిమిర్చి మిశ్రమం, బెల్లం, చింతపండు, ఉప్పు, వేయించిన పప్పులు, కొబ్బరి మిశ్రమం వేసి కొద్దికొద్దిగా నీరు పోసుకుంటూ బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి.
- ఆ తర్వాత పసుపు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరి.
- ఎంతో రుచికరమైన మూడు పప్పుల కొబ్బరి పచ్చడి రెడీ.
- ఒకవేళ మీకు కారం సరిపోలేదనుకుంటే.. కాసిన్ని ఎండు మిర్చి, పచ్చిమిర్చిని నూనెలో వేసి వేయించి మిక్సీ పట్టుకుని ఈ పచ్చడిలో కలుపుకుంటే సరిపోతుంది.
ఆంధ్రా "గోంగూర నువ్వుల పచ్చడి" - ఈ ప్రిపరేషన్ స్టైలే కేక!
నోరూరించే "బీరకాయ టమాట పచ్చడి" - ఇలా ప్రిపేర్ చేస్తే రుచికి రుచీ ఆరోగ్యానికి ఆరోగ్యం!