Paris Olympics 2024 Badminton : పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ కచ్చితంగా మెడల్ సాధిస్తుందనుకున్న ఈవెంట్లలో బ్యాడ్మింటన్ కూడా ఒకటి. వరుసగా 2012 లండన్, 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లలో మెడల్స్ రావడమే దీనికి కారణం. లండన్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్ బ్రాంజ్ మెడల్‌ను అందుకోగా, రియోలో సిల్వర్, టోక్యోలో బ్రాంజ్ మెడల్స్‌తో పీవీ సింధు మెరిసింది.
అందుకే ఈసారి బ్యాడ్మింటన్ ఈవెంట్లో ఒకటి కన్నా ఎక్కువ మెడల్స్ రావొచ్చని చాలా మంది భావించారు. హ్యాట్రిక్ మెడల్ కోసం సింధు బరిలో దిగడం, సింగిల్స్‌లో హెచ్.ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ సూపర్ ఫామ్‌తో కనపడటం, ప్రపంచ బ్యాడ్మింటన్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ ఫామ్‌లో ఉండటంతో అంచనాలు బాగా పెరిగాయి.
దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా బ్యాడ్మింటన్ కోసం భారీగానే ఖర్చు చేసింది. ఈ పారిస్ ఒలింపిక్స్ కోసం రూ.470 కోట్లు కేటాయించింది. అందులో బ్యాడ్మింటన్‌కు రూ.72.03 కోట్లు. అథ్లెటిక్స్ (రూ.96.08 కోట్లు) తర్వాత బ్యాడ్మింటన్‌కే అధికంగా నిధులు కేటాయించింది. కానీ బ్యాడ్మింటన్‌లో ఫలితాలు నిరాశను కలిగించాయి.
లక్ష్య సేన్ తప్పా మిగతా వాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. సింధు ట్రైనింగ్ కోసం రూ.3.13 కోట్లు ఖర్చు చేస్తే ఆమె ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది.