Olympics Gold Medal :ప్రపంచ అథ్లెటిక్స్ సంస్థ (డబ్ల్యూఏ) తాజాగా ఓ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఒలింపిక్స్‌లోని 48 అథ్లెటిక్స్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించే ప్లేయర్లకు నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ నుంచి స్వర్ణంతో పాటు రజత, కాంస్య పతక విజేతలకు నగదు బహుమతులు అందించనున్నట్లు పేర్కొంది.
"ఒలింపిక్స్‌లో నగదు బహుమతి అందజేసే మొదటి అంతర్జాతీయ క్రీడా సమాఖ్యగా డబ్ల్యూఏ నిలుస్తుంది. అత్యున్నత క్రీడల్లో బంగారు పతకాలు సాధించే ఈ క్రీడాకారులకు పారిస్ ఒలింపిక్స్ నుంచి ప్రైజ్‌మనీ అందజేస్తాం. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆదాయంలో వాటా కింద ప్రతి నాలుగేళ్లకు ఒకసారి 2.4 మిలియన్ డాలర్లు (సుమారు రూ.20 కోట్లు) అందుకుంటుంది. ఈ మొత్తాన్ని పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో 48 విభాగాల్లో స్వర్ణ పతకాలు గెలిచే క్రీడాకారులకు పంచుతాం. ఒక్కొక్కరికి 50,000 డాలర్లు (సుమారు రూ.41.60 లక్షలు) ప్రైజ్‌మనీగా ఇవ్వనున్నాం" అని డబ్ల్యూఏ పేర్కొంది.
ఒలింపిక్స్ అథ్లెట్లకు పప్పు, అన్నం
పారిస్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో అథ్లెట్లకు భారతీయ వంటకాల రుచి చూపించనున్నారు. ఆహారం విషయంలో భారత అథ్లెట్లకు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా బాస్మతి బియ్యంతో చేసిన రైస్ ఇంకా పప్పు, చపాతీ, ఆలుగడ్డ- గోబీ, చికెన్, పులుసుల ఇలా పలు రకాల భారతీయ వంటకాలను అక్కడ వడ్డించనున్నారు. దీనికి సంబంధించి ఒలింపిక్స్ నిర్వాహకులకు ఇప్పటికే భోజనాల లిస్ట్‌ను పంపించినట్లు సమచారం.