India Hockey New Goal Keeper Krishan Bahadur Pathak : అతడు బరిలో దిగితే ఓ భరోసా. తన సర్వశక్తులు ఒడ్డి పోరాడుతాడు. గోడలా నిలుస్తాడు. అందుకే ప్రత్యర్థి జట్టు గోల్ కొట్టాలంటే శ్రమించాల్సిందే. ఇప్పటికే తన అసాధారణ నైపుణ్యం, ప్రదర్శనతో భారత్ వరుసగా రెండు ఒలింపిక్ కాంస్య పతకాలు సాధించడంలో అత్యంత కీలక పాత్ర కూడా పోషించాడతడు. అతడే గోల్ కీపర్ శ్రీజేష్. కానీ ఇప్పుడతడు తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో గోల్ కీపర్‌గా హాకీలో అతడి వారసుడెవరు? అతడు లేని లోటును ఇతరులు తీర్చగలరా? అసలు తీర్చడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు ప్రస్తుతం భారత హాకీకి ఎదురవుతున్నాయి.
అయితే ఈ ప్రశ్నలకు ఓ సమాధానం ఉంది. అదేంటంటే కృష్ణ బహదూర్ పాఠక్. శ్రీజేశ్ స్థానాన్ని ఇతడే భర్తీ చేయనున్నాడు. అప్పటి చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ ఆధ్వర్యంలో 2018లో అరంగేట్రం చేశాడు. 2019లో గ్రాహం రీడ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి గోల్ కీపర్ శ్రీజేశ్‌కు డిప్యూటీగా వ్యవహరిస్తున్నాడు.
అయితే రీడ్ ప్రతి క్వార్టర్‌కు కూడా కీపర్లను మారుస్తుండేవాడు. అందుకు కారణం పాఠక్ కూడా మ్యాచ్ టైమ్, అనుభవం పొందాలని అతడు భావించడమే కారణం. అవసరమైనప్పుడు పాఠక్ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని రీడ్ అలా చేసేవాడు.
ప్రస్తుత చీఫ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టాన్ కూడా ఇదే విధానాన్ని(ప్రతీ క్వార్టర్‌కు కీపర్లను మార్చడం) కొనసాగిస్తూ ముందుకెళ్లాడు. దీంతో ఆసియా గేమ్స్, వరల్డ్ కప్ సహా అనేక మ్యాచుల్లో ఛాలెంజెస్ ఎదురైనప్పుడు పాఠక్ ఎంతో పరిణతిని, సంయమనాన్ని పాటించాడు. ఇప్పటివరకు అతడు దాదాపు 125 మ్యాచ్‌ల వరకు ఆడాడు.