Neeraj Chopra Diamond League :తాజాగా జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. శనివారం జరిగిన ఈ ప్రాతిష్టాత్మక పోటీలో అత్యుత్తమంగా 87.86 మీటర్ల దూరం ఈటె విసిరిన నీరజ్, కేవలం ఒక్క సెంటీమీటర్ తేడాతో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. దీంతో గ్రెనడాకు చెందిన పీటర్స్ అండర్సన్ 87.87 మీటర్లతో తొలి స్థానాన్ని కైవసం చేసకుంది.
ఈ గేమ్‌లో తన మూడో ప్రయత్నంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన నీరజ్ ఆఖరి ప్రయత్నంలో 86.46 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి రెండో స్థానానికి పరిమితమయ్యాడు. జర్మనీకి చెందిన జులియన్ వెబర్ 85.97 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు. గతేడాది జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్స్‌లోనూ నీరజ్‌కు రెండో స్థానమే దక్కింది. పారిస్ ఒలింపిక్స్‌లోనూ నీరజ్ రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచాడు.
అయితే జూరిచ్ డైమండ్ లీగ్‌లో నీరజ్ పాల్గొనలేదు. అయినప్పటికీ అతడు 14 పాయింట్లతో నాలుగో స్థానం సాధించి బ్రస్సెల్స్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ జాబితాలో గ్రెనెడా అథ్లెట్ అండర్సన్ పీటర్స్ 29 పాయింట్లు, జర్మనీ క్రీడాకారుడు జులియన్ వెబర్ 21 పాయింట్లు, చెక్ రిపబ్లిక్ జావెలిన్ త్రో స్టార్ జాకుబ్ 16 పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో నిలిచారు. కాగా, పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విజేత, పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ ఈ డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోవడం గమనార్హం. కేవలం 5 పాయింట్లను మాత్రమే సాధించి అనర్హతకు గురయ్యాడు.