Syed Mushtaq Ali Trophy 2024 :2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో ముంబయి ఘన విజయం సాధించింది. బెంగళూరు వేదికగా మధ్యప్రదేశ్‌తో జరిగిన తుదిపోరులో ముంబయి 5 వికెట్ల తేడాతో నెగ్గి టైటిల్ ముద్దాడింది. 175 పరుగుల లక్ష్య ఛేదనను ముంబయి 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యంగ్ బ్యాటర్ సుయాంశ్ షెగ్డే (36* పరుగులు: 15 బంతుల్లో; 3x4, 3x6) చివర్లో రఫ్పాడించాడు. అథర్వ అంకోలేకర్ (16*: 6 బంతుల్లో; 2x6) సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. సూర్యకుమార్ యాదవ్ (48 పరుగులు), అజింక్యా రహానే (37 పరుగులు) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో త్రిపురేష్ సింగ్ 2, శివమ్ శుక్లా, వెంకటేశ్ అయ్యర్, కుమార్ కార్తికేయ తలో 1 వికెట్ పడగొట్టారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటీదార్ (81* పరుగులు: 40 బంతుల్లో; 6x4, 6x6) సూపర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో మధ్యప్రదేశ్‌కు మంచి స్కోర్ లభించింది. ముంబయి బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, డియాస్ చెరో 2, అథర్వ అంకోలేకర్, శివమ్ దూబె, సుయాంశ్ షెగ్డే తలో 1 వికెట్ దక్కించుకున్నారు.
- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్- సూర్యాంశ్ షెడ్గే
- ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ - అజింక్య రహానె (469 పరుగులు)
కాగా, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకోవడం ముంబయికి ఇది రెండోసారి. 2022/23 ఎడిషన్‌లో ముంబయి తొలిసారి కప్పు ముుద్దాడింది. మరోవైపు ఫైనల్లో ఓడడం మధ్యప్రదేశ్‌కు ఇది రెండోసారి. 2010లోనూ ఫైనల్ చేరిన మధ్యప్రదేశ్ ఓడగా, తాజా సీజన్లోనూ రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.