Mohammed Siraj Vs Travis Head : అడిలైడ్ వేదికగా తాజాగా జరిగిన పింక్ బాల్ టెస్టు సందర్భంగా టీమ్ఇండియా బౌలర్ మహ్మద్ సిరాజ్- ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన మాటల యుద్ధం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో సిరాజ్ మ్యాచ్ ఫీజులో 20శాతం జరిమానాగా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అలాగే ఒక డీమెరిట్ పాయింట్‌ను సైతం అతడికి విధించింది. ఈ క్రమంలో సిరాజ్ తాజాగా విలేకరి అడిగిన ప్రశ్నకు చెప్పిన సమాధానం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
ఐసీసీ జరిమానా విధించినందుకు కలత చెందారా? అని ఓ విలేకరి అడగ్గా, దానికి సిరాజ్ 'నేను ఇప్పుడు జిమ్‌కి వెళ్తున్నాను. అంతా బాగుంది.' అని సమాధానమిచ్చాడు. దీంతో సిరాజ్ తనపై ఐసీసీ తీసుకున్న చర్యలపై అంతగా అసంతృప్తిగా లేడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈ వివాదం నేపథ్యంలో మూడో రోజు ఆటలో సిరాజ్ బ్యాటింగ్ చేస్తుండగా హెడ్ దగ్గరకు వెళ్లాడు. వీళ్లద్దరూ సరదాగా కాసేపు ఏదో మాట్లాడుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య గొడవకు ఎండ్ కార్డ్ పడినట్లైంది.
అసలేం జరిగిందంటే?
అడిలైడ్ వేదికగా ఆసీస్, భారత్ మధ్య జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ సందర్భంగా ట్రావిస్ హెడ్ - మహ్మద్ సిరాజ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. హెడ్ ను క్లీన్ బౌల్డ్ చేశాక సిరాజ్ సంబరాలు చేసుకుంటూ బయటికి వెళ్లిపో అంటూ సైగలు చేశాడు. అలాగే హైడ్ సైతం సిరాజ్ ను చూస్తూ ఏదో అన్నట్లు అనిపించింది.
చర్యలకు ఉపక్రమించిన ఐసీసీ
ఈ మాటల యుద్ధాన్ని ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. సిరాజ్ మ్యాచ్ ఫీజులో 20శాతం జరిమానాగా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తోటి క్రీడాకారుడి పట్ల మైదానంలో అనుచితంగా ప్రవర్తించడం ద్వారా ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని 2.5 ఆర్టికల్‌ను ఉల్లంఘించినందుకు అతడి మ్యాచ్ ఫీజులో 20శాతం పెనాల్టీ విధించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
హెడ్పైనా చర్యలు
అలాగే, హెడ్ పైనా చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. క్రమశిక్షణ ఉల్లంఘనకు గాను ఇద్దరికీ ఒక్కో డీమెరిట్ పాయింట్ ను జరిమానాగా విధించింది. ఇద్దరూ తమ తప్పుల్ని అంగీకరించారని, మ్యాచ్ రిఫరీ ప్రతిపాదించిన చర్యలకు అంగీకారం తెలిపారని ఐసీసీ వెల్లడించింది.
సిరాజ్‌కు బుమ్రా టిప్స్- ఒక్క మాటతోనే 5 వికెట్లు తీశాడంట!
హెడ్ Vs సిరాజ్ - ఐసీసీ ఫైన్ విషయంలో స్టార్ పేసర్ కూల్ రిప్లై!
ఐసీసీ ఫైన్ విధించడంపై సిరాజ్ రిప్లై - విలేకరి ప్రశ్నకు కూల్‌గా సమాధానమిచ్చిన స్టార్ పేసర్!
Mohammed Siraj (Associated Press)
Published : 7 hours ago