Mohammed Shami Australia Tour : గత కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఇప్పుడు మళ్లీ భారత జట్టులోకి చేరేందుకు సిద్ధమవుతున్నాడు. రీసెంట్‌గానే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలోని రిహాబిలిటేషన్ సెంటర్లో ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన షమీ, ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి వచ్చే ముందు దేశవాళీ క్రికెట్ ఆడి, తన సత్తా చూపిస్తానని అన్నాడు షమీ. అంతేకాకుండా ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా ఆడుతానని ధీమా వ్యక్తం చేశాడు. అయితే ప్రస్తుతానికి మాత్రం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అతడిని ఎంపిక చేయలేదు.
నవంబర్ 22 నుంచి భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్ట్‌ల బోర్డర్-గవాస్కర్ సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి ఎంపికై సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే పెర్త్ వేదికపై గతంలోనే షమీ తన అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో ప్రత్యర్థులను హడలెత్తించాడు. ఇంతకీ అది ఎప్పుడంటే?
2018లో పెర్త్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. ఇక ఈ సిరీస్ కోసం అప్పటి టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తమ జట్టు నుంచి నలుగురు పేసర్లను రంగంలోకి దింపాడు. అందులో షమీ కూడా ఉన్నాడు. ఇక షమీ తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టకుండా నిరాశపరిచాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చెలరేగిపోయాడు. తన బౌలింగ్ స్కిల్స్‌తో ఆస్ట్రేలియా లోయర్ మిడిల్ ఆర్డర్‌ను చీల్చి చెండాడాడు. అంతేకాకుండా ఒకానొక దశలో హ్యాట్రిక్ వికెట్లు సాధించి అందరినీ అబ్బురపరిచాడు. వరుస బంతుల్లో టిమ్ పైన్ అలాగే ఆరోన్ ఫించ్ లాంటి అత్యుత్తమ ప్లేయర్లను పెవిలియన్ బాట పట్టించాడు.