Siraj Spin Bowling :భారత్ - బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మూడో రోజు ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ స్పిన్ బౌలింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. కానీ, ఫీల్డ్ అంపైర్ అనుమతించకపోవడం వల్ల అది సాధ్యపడలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకీ మూడో రోజు మ్యాచ్లో ఏం జరిగిందింటే?
వాస్తవానికి మూడో రోజు ఆట 45 నిమిషాలు ముందుగానే ముగిసింది. శనివారం సాయంత్రం 4.15 నిమిషాలకు మైదానం చుట్టూ మేఘాలు కమ్ముకున్నాయి. గ్రౌండ్లో వెలుతురు తక్కువైంది. దీంతో ఆటను కొనసాగించాలా? వద్దా? అని అంపైర్లు చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 'పేసర్లకు బదులుగా స్పిన్నర్లతోనే బౌలింగ్ వేయిస్తా' అని అటను కొనసాగించాలంటూ అంపైర్లకు తెలిపాడు.
అయితే అప్పటికే ఓవర్ ప్రారంభిచిన సిరాజ్ రెండు బంతులు వేసేశాడు. రోహిత్ మాటలు విన్న సిరాజ్ ఆ ఓవర్లో మిగిలిన నాలుగు బంతులను స్పిన్ బౌలింగ్ వేయడానికి సిద్ధమయ్యాడు. వెంటనే స్పిన్ బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడు. కానీ, అంపైర్ ఆట కొనసాగించడానికి అంగీకరించలేదు. దీంతో మూడో రోజు ఆట ముగిసింది. ఇక వైరల్గా మారిన ఈ వీడియో చూసిన నెటిజన్లు 'ఫన్నీ సిరాజ్' అంటూ కామెంట్ చేస్తున్నారు.