MC Mary Kom Retirement:తాను ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు వస్తున్న వార్తలపై స్టార్ బాక్సర్ మేరీకోమ్ (MC Mary Kom) స్పందించింది. ఆటకు వీడ్కోలు పలికినట్లు తాను ఎక్కడా చెప్పలేదని పేర్కొంది. "నేను రిటైర్మెంట్ ప్రకటించినట్లు కొన్ని కథనాలు వస్తున్నాయి. అవన్నీ అబద్దం. నేను రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఆటకు గుడ్‌బై చెప్పాలనుకున్నప్పుడు నేనే మీడియా ముందుకు వచ్చి చెబుతా. రీసెంట్గా ఓ స్కూల్ ఈవెంట్లో పాల్గొన్నప్పుడు పిల్లల్ని ప్రోత్సహిస్తూ, 'నాకు స్పోర్ట్స్‌లో ఇంకా అనేక ఘనతలు సాధించాలని ఉంది. కానీ, ఏజ్ లిమిట్ వల్ల నేను ఒలింపిక్స్‌లో పాల్గొనే ఛాన్స్ లేదు. అయినప్పటికీ నేను నా ఫిట్‌నెస్‌పైనే దృష్టి సారిస్తున్నా' అని చెప్పాను. దాన్ని ఈ విధంగా అర్థం చేసుకున్నారు. రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చినప్పుడు అందరికి చెబుతా' అని మేరికోమ్ చెప్పింది.
Mary Kom Awards:41ఏళ్ల మేరీకోమ్ 2 దశాబ్దాలకుపైగా కెరీర్లో కొనసాగుతోంది. 2001 లో అరంగేట్రం చేసిన ఈ మణిపుర్ బాక్సర్ తన కెరీర్లో పలు అత్యుత్తమ పురస్కారాలు అందుకుంది. 2003లో అర్జునా అవార్డు అందుకున్న మేరీకోమ్, 2009లో భారత ప్రభుత్వం ఆమెను రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డుతో సత్కరించింది. దీంతో పాటు ఆమెకు 2006లో పద్మ శ్రీ అవార్డు, 2013 పద్మభూషన్, 2020లో పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి.