Paris Olympics 2024 Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించి భారత పతాకాన్ని రెపరెపలాడించిన షూటర్ మను బాకర్. వ్యక్తిగత, మిక్స్‌డ్ డబుల్స్‌లో మెడల్స్‌ను సాధించి, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పకకాలను అందుకున్న తొలి అథ్లెట్‌గా నిలిచింది. అయితే, తాజాగా ఖేల్ రత్న పురస్కారాల కోసం నామినేషన్ల జాబితాలో ఆమెకు స్థానం లభించలేదని ప్రచారం సాగుతోంది. ఇప్పుడీ విషయం క్రీడా వర్గంలో తీవ్ర చర్చకు దారి తీసింది.
తాజాగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డు కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం అందింది. ఇందులోనే మను బాకర్ పేరు లేదని సోషల్ మీడియాలో కథనాలు కనిపిస్తున్నాయి. అయితే, అధికారిక వర్గం మాత్రం మను బాకర్ అసలు దరఖాస్తే చేయలేదని ఓ ప్రకటనను విడుదల చేసింది.
స్పందించిన మను బాకర్ తండ్రి - ఈ విషయంపై మను బాకర్ తండ్రి స్పందించారు. క్రీడా అత్యున్నత పురస్కారం కోసం తాము దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. 12 మందితో కూడిన జాతీయ స్పోర్ట్స్ డే కమిటీ మాత్రం మను బాకర్‌కు అవకాశం ఇవ్వనట్లు తెలుస్తోంది.
"ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన అథ్లెట్ కూడా అవార్డుల కోసం అడగాలా? ప్రభుత్వంలోని ఓ అధికారి నిర్ణయించారు. కమిటీ సభ్యులు సైలెంట్‌గా ఉన్నారు. ఇదేనా మీరు అథ్లెట్లను ప్రోత్సహించే పద్ధతి? నాకు అస్సలు అర్థం కావడం లేదు. మేం మెడల్స్ కోసం దరఖాస్తు చేశాం. కానీ, కమిటీ నుంచి ఎలాంటి ప్రతి స్పందన రాలేదు. ఇలాగైతే తమ పిల్లలను క్రీడల్లో పాల్గొనమని తల్లిదండ్రులు ఎలా ప్రోత్సహించగలరు? వారిని కూడా ఐఆర్‌ఎస్ లేదా ప్రభుత్వ ఉద్యోగిగా మారమని చెబుతారు" అని మను తండ్రి రామ్‌కిషన్ బాకర్ పేర్కొన్నారు. కాగా, మన బాకర్‌కు 2020లో అర్జున పురస్కారం దక్కింది.