Paris Olympics 2024 Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో తొలి పతకం చేరింది. 10మీటర్ల ఎయిర్ పిస్టర్ ఈవెంట్లో మనూ బాకర్ పకతం సాధించింది. ఫైనల్లో 221.7 పాయింట్లతో బాకర్ 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని ముద్దాడింది. ఇక షూటింగ్ ఈవెంట్లో పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా మనూ బాకర్ ఘనత సాధించింది. కాగా, తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఓయె జిన్ (243.2 పాయింట్లు) స్వర్ణం, కిమ్ యెజి (241.3 పాయింట్లు) రజతం పతకాలు కాగా, ఈ ఈవెంట్లో 12ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం లభించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 25మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టోల్ విభాగంలో విజయ్ కుమార్ రజతం, పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో గగన్ నారంగ్ కాంస్య పతకాలను సాధించారు.
ఇక పతకం సాధించిన తర్వాత బాకర్ మాట్లాడింది. భగవద్గీతతో ఫైనల్లో ఒత్తిడిని జయించినట్లు చెప్పింది. 'మానసిక ఒత్తిడిని జయించేందుకు భగవద్గీత చదివాను. ప్రతి పనిలోనూ నావంతు కృషి చేసి ఫలితాన్ని ఆ భగవంతుడిపైనే వదిలేశా. విధితో మనం పోరాడలేం. తుది ఫలితాన్ని మనం నియంత్రించలేం. మెరుగైన ప్రదర్శన మాత్రమే మన చేతిలో ఉంటుంది. క్వాలిఫికేషన్ తర్వాత మున్ముందు ఏం జరుగుతుందో తెలియలేదు. మేం చాలా కష్టపడ్డాం. చేయగలిగినంత చేశాం. పతకం సాధించడం గొప్ప అనుభూతి. నా వెన్నంటి నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. కోచ్ జస్పాల్ రాణా, స్పాన్సర్‌లకు ధన్యవాదాలు' అని తెలిపింది. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున తొలి పతకం సాధించిన బాకర్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.