Manoj Tiwary on Gautam Gambhir :భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు చేశాడు. గంభీర్ 'కపట వేషాలు వేస్తాడు (Hypocrite)' అని అన్నాడు. అతడు బోధించే వాటిని పాటించడం లేదని ఆరోపించాడు. ఇటీవల ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ మనోజ్ తివారీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపుతున్నాయి.
'గౌతమ్ గంభీర్ కపట వేషాలు వేస్తాడు. అతడు చెప్పినట్టు చేయడు. కెప్టెన్ (రోహిత్), అభిషేక్ నాయర్ ఇద్దరూ ముంబయి నుంచే వచ్చారు. వారికి ముంబయి ప్లేయర్లను ముందంజలో ఉంచే అవకాశం లభించింది. కానీ, జలజ్ సక్సేనా లాంటి వాళ్ల కోసం మాట్లాడే వారు లేరు. అతడు బాగా రాణిస్తున్నాడు'అని చెప్పాడు.
తనకు అనుకూలంగా ఉండే వ్యక్తులను గంభీర్ ప్రోత్సహిస్తాడని మనోజ్ అన్నాడు. 'మోర్నీ మోర్కెల్ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నుంచి వచ్చాడు. అలాగే అభిషేక్ నాయర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో గంభీర్‌తో కలిసి ఉన్నాడు. వాళ్లిద్దరితో గంభీర్ కంఫర్ట్‌గా ఉంటాడు. అతడు ఏది చెప్పినా, ఓకే అనే వారికి ప్రాధాన్యం ఉంటుంది' అని పేర్కొన్నాడు.
అది సమష్టి కృషి
2012లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలవడం పూర్తిగా గంభీర్ క్రెడిట్‌గా చెప్పడాన్ని తివారీ తప్పుబట్టాడు. తనతో సహా జాక్వెస్ కల్లిస్, మన్విందర్ బిస్లా, సునీల్ నరైన్ అద్భుతంగా రాణించడం వల్ల ఆ సీజన్ టైటిల్ గెలిచామని, ఒక్క గంభీర్ కెప్టెన్సీతోనే కప్పు రాలేదని అన్నాడు. అయితే క్రెడిట్ మొత్తాన్ని తీసుకునేందుకు వీలు కల్పించే వాతావరణం, పీఆర్ ఉండటం వల్ల గంభీర్ క్రెడిట్ తీసుకున్నాడని ఆరోపించాడు.