KL Rahul IPL 2024:లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న విమర్శలు గుర్తుచేసుకున్నాడు. అప్పట్లో తనకు 'టెస్టు ప్లేయర్' అనే ట్యాగ్ ఇచ్చారని అన్నాడు. రీసెంట్గా ప్రముఖ స్పోర్ట్స్ బ్రాడ్కాస్ట్ స్టార్‌స్పోర్ట్ ఇంటర్వూలో రాహుల్ మాట్లాడాడు. ఇందులో తన కెరీర్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు.
కెరీర్ ప్రారంభంలో టెస్టు ప్లేయర్ అనే ముద్ర పోగోట్టుకోడానికి రాహుల్ ఎంతో కష్టపడ్డట్లు చెప్పాడు. తాను కూడా టీ20, వన్డేల్లో ఆడగలనని అందరిలో నమ్మకం క్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డట్లు తెలిపాడు. ఎన్నో రోజుల శ్రమ వల్ల వైట్‌బాల్ (వన్డే, టీ20) ప్లేయర్‌గా గుర్తింపు పొందినట్లు చెప్పాడు. 'కెరీర్ ప్రారంభంలో ఓ సిక్స్ బాదితే నేనే షాక్ అయ్యేవాడిని. అప్పట్లో నేను బలమైన టీ20, వన్డే ప్లేయర్ కాదు. దీంతో నాకు టెస్టు ప్లేయర్ అనే ట్యాగ్ ఇచ్చారు. నేను టెస్టు ప్లేయర్ అని టీ20, వన్డే మ్యాచ్‌లు ఆడలేనని అనేవారు. కానీ, 2016 ఐపీఎల్ నా కెరీర్లో టర్నింగ్ పాయింట్. ఆ సీజన్లో ఆర్సీబీ తరఫున నేను బాగా (397 పరుగులు) ఆడాను. అప్పట్నుంచే నేను వైట్‌బాల్ క్రికెట్ కూడా బాగా ఆడగలనని ప్రేక్షకులు నమ్మారు. చాలా రోజులు కష్టపడిన తర్వాత నాకు ఈ గుర్తింపు దక్కింది' అని రాహుల్ అన్నాడు.