Litton Das vs Pakistan:బంగ్లాదేశ్ బ్యాటర్ లిట్టన్ దాస్ పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు వచ్చిన దాస్ పాక్ బౌలర్లకు ఎదురొడ్డి సెంచరీ (138 పరుగులు) బాదాడు. మరో ఎండ్‌లో మెహదీ హసన్ మిరాజ్ హాఫ్ సెంచరీ (78 పరుగులు)తో రాణించాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 262 పరుగులు చేసి ఆలౌటైంది
26-6 నుంచి 262-10
తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు ఆరో ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. 14 పరుగుల వద్ద ఓపెనర్ జాకీర్ హసన్ (1) క్యాచౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత పాక్ బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాటర్లు నిలువలేకపోయారు. 12 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయి బంగ్లా పీకల్లోతు కష్టాల్లో మునిగింది. ఈ దశలో లిట్టన్ దాస్, మెహదీ హసన్ అద్భుతంగా పోరాడారు. వీరిద్దరూ కలిసి 7వ వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా బంగ్లాకు తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోర్ లభించింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ముగిసేసరికి బంగ్లా కేవలం 12 పరుగులు వెనుకంజలో ఉంది. లేకపోతే బంగ్లా 50లోపే ఆలౌట్ అయ్యి ఉండేదేమో! ఇక పాక్ బౌలర్లలో ఖుర్రమ్ షహజాద్ 6, మీర్ హమ్జా, అఘ సల్మాన్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 85.1 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. సయిమ్ ఆయుబ్ (58 పరుగులు), కెప్టెన్ మసూద్ (57 పరుగులు), అఘ సల్మాన్ (54 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహదీ మిర్జా 5 వికెట్లు పడగొట్టగా, తస్కిన్ అహ్మద్ 3, నహిద్ రానా, షకీబ్ అల్ హసన్ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు.