Lionel Messi Kerala Tour : అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ త్వరలోనే భారత్‌కు రానున్నాడు. గతంలోనే ఈ విషయాన్ని కేరళ ప్రభుత్వం వెల్లడించగా, తాజాగా మరోసారి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్ - నవంబర్ మధ్య కేరళలో ఒక వారం పాటు మెస్సీ గడపనున్నట్లు కేరళ క్రీడా మంత్రి వి అబ్దురహిమాన్ తాజాగా ప్రకటించారు.
కేరళలో కనీసం రెండు స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడేందుకు మెస్సీ నేతృత్వంలోని పురుషుల జాతీయ జట్టుకు సంబంధించి అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్‌తో తమ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి గత నవంబర్‌లో చెప్పారు. "అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 మధ్య మెస్సీ కేరళలో ఉంటాడు. ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడడమే కాకుండా మీ అందరినీ కలిసేందుకు వేదికపై 20 నిమిషాలు కేటాయిస్తారు." అని క్రీడా మంత్రి పేర్కొన్నారు.
ఖర్చు మొత్తం వారిదే!
ఈ అంతర్జాతీయ మ్యాచ్‌ను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో జరగనుందని కేరళ క్రీడా శాఖ మంత్రి అబ్దురహిమన్ పేర్కొన్నారు. "ఈ హై ప్రొఫైల్ ఫుట్‌బాల్ ఈవెంట్ నిర్వహించేందుకు కావాల్సిన మొత్తం ఖర్చును రాష్ట్రానికి సంబంధించిన మెర్చంట్స్ ద్వారా అందించబడుతుంది." అని క్రీడా శాఖ మంత్రి అన్నారు. ఈ ప్రతిష్టాత్మక ఫుట్ బాల్ ఈవెంట్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.