KL Rahul Koffee With Karan Show :బాలీవుడ్లో మోస్ట్ పాపులర్ షోగా పేరొందిన 'కాఫీ విత్ కరణ్'లో తాను చేసిన కామెంట్స్ గురించి స్టార్ క్రికెటర్ రాహుల్ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ ఇంటర్వ్యూ వల్ల తన జీవితం పూర్తిగా మారిపోయిందని, అంతేకాకుండా ఆ కాంట్రవర్సీ తనను ఎంతగానో భయపెట్టిందని రాహుల్ తెలిపాడు. ఓ ప్రముఖ పోడ్కాస్ట్లో ఈ విషయం గురించి తాజాగా స్పందించాడు.
"సాధారణంగా నేను ట్రోలింగ్స్‌ను అంతగా పట్టించుకోను. అయితే, కొన్నేళ్ల క్రితం నా గురించి నెట్టింట విపరీతమైన విమర్శలు వచ్చాయి. నేను కూర్చున్నా, నిల్చున్నా కూడా నెటిజన్లు నన్ను ఎంతగానో ట్రోల్స్ చేశారు. ఆ ఇంటర్వ్యూ (కాఫీ విత్ కరణ్ షో) వ్యక్తిగతంగా నా జీవితాన్ని బాగా మార్చేసింది. మాములుగా నేను సాఫ్ట్‌గా ఉండే వ్యక్తిని. కానీ టీమ్‌ఇండియాకు ఆడటం మొదలుపెట్టాక నాలో ఎక్కడిలేని కాన్ఫిడెన్స్ పెరిగింది. 100 మంది మధ్యలోనూ బాగా మాట్లాడగలిగేవాణ్ని. అయితే ఆ ఘటన తర్వాత నేను ఇప్పుడు ముందులా ఉండలేకపోతున్నా. ఆ ఇంటర్వ్యూ నన్ను బాగా భయపెట్టింది. స్కూల్లో నన్నెప్పుడూ సస్పెండ్ చేయలేదు, అలాగే శిక్షించలేదు కూడా. కానీ ఆ వ్యాఖ్యల కారణంగా నేను జట్టులో నుంచి సస్పెన్షన్‌కు గురయ్యాను. తొలిసారి అలాంటి అనుభవం ఎదురవడం వల్ల దాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియలేదు. ఇప్పటికీ అది నా జీవితంలో ఓ మాయని మచ్చలా మిగిలిపోయింది" అంటూ రాహుల్ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నాడు.