Jay Shah ICC Chairman :అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నూతన ఛైర్మన్‌గా బీసీసీఐ సెక్రటరీ జై షా ఆదివారం (డిసెంబర్ 1) బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు నుంచి ఛైర్మన్‌గా జై షా తన పదవీ కాలాన్ని ప్రారంభించారని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, రెండేళ్లపాటు జై షా ఈ పదవిలో కొనసాగనున్నారు.
కాగా, ఈ ఏడాది ఆగస్టులో ఐసీసీ అధ్యక్ష పదవికి జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి కేవలం ఒక్క జై షా నామినేషనే దాఖలైంది. దీంతో ఎలాంటి ఎన్నిక లేకుండానే జై షా క్రికెట్ అత్యున్నత బోర్డుకు ఛైర్మన్ అయ్యారు. ఇక ప్రస్తుతం జై షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రెసిడెంట్, బీసీసీఐ సెక్రటరీగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయన ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం వల్ల ఈ రెండు పదవులకు జై షా రాజీనామా చేయవలసి ఉంటుంది. మరోవైపు ఇదివరకు ఐసీసీ ఛైర్మన్ బాధ్యతల్లో ఉన్న జార్జీ బార్క్లే నాలుగేళ్ల పదవీకాలం (2020- 2024) శనివారంతో ముగిసింది.
సవాళ్లు అవే
'క్రికెట్‌ను ప్రంపచవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు పనిచేస్తాను. ఐసీసీ సభ్య దేశాలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నా. 2028 లాస్ ఏంజిలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ నిర్వహించడం అత్యంత ముఖ్యమైన సవాళ్లు, అవకాశాలలో ఇది ఒకటి' అని జై షా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా పేర్కొన్నారు. కాగా, జై షా పదవీకాలంలో ఐసీసీ నిర్వహించనున్న తొలి టోర్నీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీనే కావడం విశేషం.