తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్ట్రేలియా ఓపెన్ ఛాంపియన్​గా సినర్- ఫైనల్​లో జ్వెరెవ్​కు నిరాశ - AUSTRALIA OPEN 2025

ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్​లో సినర్ విజయం- ఫైనల్​లో జ్వెరెవ్ ఓటమి

Jannik Sinner
Jannik Sinner (Source : Associated Press)

By ETV Bharat Sports Team

Published : Jan 26, 2025, 5:17 PM IST

Updated : Jan 26, 2025, 8:08 PM IST

Australia Open 2025 :ఇటలీ టెన్నిస్ స్టార్ సినర్ ఆస్ట్రేలియా ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ ఛాంపియన్​గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్​లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ని ఓడించి, వరుసగా రెండో గ్రాండ్​స్లామ్ టైటిల్ ముద్దాడాడు. టైటిల్ ఫైట్​లో సినర్ 6-3, 7-6 (7-4), 6-2 తేడాతో నెగ్గాడు. దీంతో కెరీర్​లో తొలి ఆస్ట్రేలియా గ్లాండ్ స్లామ్ టైటిల్ నెగ్గాలనుకున్న జ్వెరెవ్​కు నిరాశే మిగిలింది.

వరల్డ్ నంబర్ వన్‌ అయిన యానిక్‌ సినర్‌కు ఇది మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్. తాజా విజయంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరుసగా రెండు టైటిళ్లు సాధించిన నాలుగో ఆటగాడిగా సినర్ రికార్డు సృష్టించాడు. సినర్ కంటే ముందు ఆండ్రీ అగస్సీ, రోజర్ ఫెదరర్, నొవాక్‌ జకోవిచ్‌ వరుసగా రెండుసార్లు విజేతలుగా నిలిచారు.

ఫైనల్‌ మ్యాచ్‌ తొలి సెట్‌లో సినర్, జ్వెరెవ్ హోరాహోరీగా తలపడ్డారు. ఒకదశలో 3-3 పాయింట్లతో సమానంగా నిలిచారు. కానీ, ఆ తర్వాత సినర్ చెలరేగి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో జర్మనీ ఆటగాడు పుంజుకున్నట్లు కనిపించాడు. 4-3తో లీడ్‌లోకి దూసుకెళ్లాడు కూడా. అయితే ఇద్దరు ఆటగాళ్లు వరుసగా పాయింట్లు సాధించడం వల్ల స్కోర్​ 6-6తో సమం అయింది. టై బ్రేకర్‌ ఆరంభంలో జ్వెరెవ్‌ ఆధిక్యంలో నిలవగా, సినర్‌ క్రమంగా పుంజుకుని రెండో సెట్‌ను గెలిచి తన ఆధిక్యాన్ని పెంచుకున్నాడు. మూడో సెట్‌ ఆరంభంలో దూకుడుగా ఆడి గట్టిపోటీ ఇచ్చిన జ్వెరెవ్, తర్వాత క్రమంగా డీలా పడిపోయాడు. దీంతో మూడో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌లోనూ అతను ఓటమిపాలయ్యాడు. అంతకుముందు యూఎస్ ఓపెన్ 2020 ఫైనల్, ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ 2024లో జ్వెరెవ్‌కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే.

Last Updated : Jan 26, 2025, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details