Prithvi shah Sachin Tendulkar : ప్రస్తుతం పృథ్వీ షా కెరీర్ ఆగమ్యగోచరంగా మారింది. ఒకప్పుడు అరంగేట్ర టెస్టులోనే సెంటరీ బాదిన పృథ్వీ షా కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదుగుతాడని అంతా ఆశించారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్తోనూ పోల్చారు. అతడు సచిన్ అంతటి ప్లేయర్ అవుతారని పలు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. కానీ ఆ తర్వాత పలు వివాదాలు, ఫిట్ నెస్ సమస్యలతో టీమ్ ఇండియాలో చోటు కోల్పోయాడు పృథ్వీ షా. అలాగే రంజీల్లోనూ ప్లేస్ దక్కలేదు. టాలెంట్ ఉన్నా క్రమశిక్షణ లేకపోవడం వల్లే పృథ్వీ షా కెరీర్ ఇలా అయిందన్న వాదనలు కూడా వినిపించాయి.
ఇకపోతే ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగావేలంలోనూ పృథ్వీ షాను ఒక్క ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. గతేడాది వరకు దిల్లీకి ఆడిన పృథ్వీ మెరుగైన ప్రదర్శన చేయడంలో దారుణంగా విఫలమయ్యాడు. కనీసం బేస్ ధరతో (రూ.75 లక్షలకు) తీసుకొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే ఈ క్రమంలోనే పృథ్వీ షా గురించి కీలక కామెంట్స్ చేశారు ఓ బీసీసీఐ సెలక్టర్. పృథ్వీ షా సచిన్‌తో సహా ఇతర లెజెండ్ క్రికెటర్ల సలహా, సూచనలను పక్కనపెట్టేశాడని అన్నారు.
పలు సూచనలు చేసిన సచిన్! -నాలుగేళ్ల క్రితం పృథ్వీ షా డోపింగ్ టెస్టులో పట్టుబడి 8 నెలల పాటు నిషేధానికి గురయ్యాడు. ఆ సమయంలో పృథ్వీ షాతో దిగ్గజ ఆటగాడు సచిన్ మాట్లాడాడట. కెరీర్ గురించి పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. క్రమ శిక్షణ, స్వీయ నియంత్రణపై యంగ్ క్రికెటర్‌కు సచిన్ సలహాలు ఇచ్చాడట. తన స్నేహితుడు వినోద్ కాంబ్లీ కెరీర్ గురించి పృథ్వీ షాతో చర్చించాడని తెలిసింది. ఈ విషయాన్ని బీసీసీఐ మాజీ సెలక్టర్ తెలిపాడు.
"పృథ్వీ షా దిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన సమయంలో రికీ పాంటింగ్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అతడితో మాట్లాడారు. సచిన్ తెందూల్కర్ కూడా పృథ్వీ షాతో మాట్లాడి పలు సూచనలు చేశాడనేది ముంబయి క్రికెట్‌లో బహిరంగ రహస్యం. పృథ్వీషా క్రికెట్ లెజెండ్స్ ఇచ్చిన సూచనలను పాటించలేదు. అతడిలో ఎటువంటి మార్పు రాలేదు." అని బీసీసీఐ మాజీ సెలక్టర్ వ్యాఖ్యానించాడు.
ఆశ్చర్యంగా ఉంది -ఐపీఎల్ మెగావేలంలో బేస్ ప్రైస్ రూ.75 లక్షలతో బరిలోకి దిగిన పృథ్వీ షాని తీసుకొనేందుకు ఎవరూ ఆసక్తి చూపించకపోవడం ఆశ్చర్యంగా ఉందని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. యువ క్రికెటర్ ఇది ఇబ్బందికర విషమేనని అన్నాడు.