IPL 2025 Retention Rules :మరికొన్ని నెలల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలం కోసం బీసీసీఐ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫ్రాంచైజీలతో చర్చలు జరిపి వారి నుంచి పలు అభిప్రాయాలు సేకరించింది. అయితే ఈ మేగా వేలానికంటే ముందు అందరి దృష్టి బీసీసీఐ అనౌన్స్ చేయనున్న రిటెన్షన్ పాలసీపైన పడింది.
క్రీడా వర్గాల సమాచారం ప్రకారం బీసీసీఐ ఈ పాలసీ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రతీ టీమ్‌కు నలుగురు ప్లేయర్ల రిటెన్షన్‌తో పాటు రెండు ఆర్‌టీఎమ్(రైట్ టు మ్యాచ్) కార్డ్స్‌ను అందజేయాలని బోర్డు డిసైడ్ అయినట్లు సమాచారం. ఇందులో భాగంగా అనామక ఆటగాళ్లను కూడా ఐపీఎల్‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది.
క్లుప్తంగా చెప్పాలంటే, ప్రస్తుతం జట్టులో ఉన్న ఆరుగురు ప్లేయర్లను ఆయా ఫ్రాంచైజీలు అంటిపెట్టుకోవచ్చు. అయితే నలుగురిని నేరుగా రిటైన్ చేసుకుంటే, మరో ఇద్దరిని మాత్రం వేలంలో ఆర్‌టీఎమ్ కింద తిరిగి కొనుగోలు చేసుకోవచ్చు. ఈ రూల్ ప్రస్తుత జట్ల ప్రధాన ఆటగాళ్లను కంటిన్యూ చేసేందుకు ఉపయోగపడనుంది.
రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఆయా జట్లు తమ మార్క్యూ ఆటగాళ్లతో పాటు ఎమర్జింగ్ స్టార్స్, అనామక ప్లేయర్లను కూడా భాగం చేయాల్సి ఉంటుంది. అయితే, ముగ్గురు ఆటగాళ్ల రిటెన్షన్ గురించి కూడా చర్చ జరగ్గా, నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసులుబాటుకే మెజార్టీ ఫ్రాంచైజీలు ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఇది కుదరకపోతే ముగ్గురు ఆటగాళ్ల రిటెన్షన్‌తో పాటు మిగతా ముగ్గురిని ఆర్‌టీఎమ్ కార్డ్స్ ద్వారా తీసుకోవాలన్న డిమాండ్ కూడా ఫ్రాంచైజీలు బీసీసీఐ ముందు ఉంచిందట. అందుకే ఈ నలుగురి రిటెన్షన్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.