MS Dhoni Breaks Silence On IPL Future : ప్రతీ ఐపీఎల్ సీజన్లోనూ సీఎస్కే మాజీ కెప్టెన్ ధోనీ ఆడతాడా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తడం, ఆ తర్వాత మహీ ఐపీఎల్ ఆడటం సర్వసాధారణం అయిపోయింది. కానీ ఈ సారి మాత్రం అతడు ఐపీఎల్ బరిలోకి దిగుతాడా లేదా అనేది మాత్రం ప్రతిఒక్కరిలోనూ గతంలోనూ కన్నా ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఐపీఎల్ రిటెన్షన్‌పై తీవ్ర చర్చ సాగుతోంది. దీంతో మహీ ఐపీఎల్ 2025 ఆడతాడా లేదా అనేది మిలయన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.
అయితే ఇంగ్లీష్ మీడియా ప్రకారం తాజాగా ఓ కార్యక్రమంలో మహీ మాట్లాడిన మాటలు, అటు సీఎస్కే ఫ్యాన్స్‌లో ఇటు ధోనీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. అతడు తాజాగా చేసిన కామెంట్స్‌తో ఐపీఎల్‌లో తాను పాల్గొనడంపై వస్తోన్న రూమర్లకు చెక్ పెట్టినట్లైంది. మరి కొన్నేళ్ల పాటు తాను క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు ధోనీ పేర్కొన్నాడు. దీంతో మహీ మరో మూడేళ్ల వరకు మైదానంలో చూసే అవకాశం ఉంది. ఎందుకంటే రిటైన్ చేసుకునే ఆటగాళ్లను కనీసం మూడేళ్ల పాటు ఆడించేందుకు ఛాన్స్ ఉంటుంది.
"క్రికెట్‌ను ఆస్వాదిస్తూ ఆడితే టీమ్‌తో పాటు, వ్యక్తిగతంగాను ప్రయోజనం ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఇకపై ఆడబోయే క్రికెట్‌ను మరింత ఎక్కువగా ఆస్వాదించాలని అనుకుంటున్నాను. ప్రొఫెషనల్ గేమ్ ఆడేవారు ఎప్పుడూ ఎంజాయ్ చేయలేరు. కానీ, నేను మాత్రం అలా ఉండను. కానీ, ఇది నిజానికి చాలా కష్టమైందే. కమిట్‌మెంట్స్, భావోద్వేగాలు కూడా ఉంటాయి. వీటన్నింటిని పక్కన పెట్టి రాబోయే కొన్నేళ్ల పాటు ఆటను ఆస్వాదిస్తూ ఆడాలనుకుంటున్నాను. దీని కోసం గత తొమ్మిది నెలలుగా ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి సారించాను. ఐపీఎల్‌లో కేవలం రెండున్నర నెలలు మాత్రమే ఆడతాను. ఇందుకోసం పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. ఇదే సమయంలో వ్యక్తిగతంగానూ జీవితాన్ని గడపాలి" అని మహీ పేర్కొన్నాడు.