Yashasvi Jaiswal VS Prithvi Shaw :'ప్రతిభ కన్నా క్రమశిక్షణ ముఖ్యం' - ఇది ప్రతీ వ్యక్తికి ఉండాల్సిన మొదటి లక్షణం. అప్పుడే ఏ రంగంలోనైనా రాణించి ఉన్నత స్థాయికి ఎదగగలం. ఇదే మాటను క్రికెట్లో దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ పృథ్వీ షాకు చెప్పాడు. సచిన్ అప్పట్లో ఆ మాటను తనతో ఎందుకు అన్నాడో ఇప్పుడు పృథ్వీకి బాగా అర్థమయ్యే ఉండాలి.
ఎందుకంటే పృథ్వీ ప్రతిభ ఎలాంటిదో క్రికెట్ ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెహ్వాగ్ స్టైల్లో కాలు కదపకుండా సూపర్ టైమింగ్‌తో బంతిని బౌండరీకి పంపగలడు. మైదానం నలుమూలలా షాట్లు బాదగలిగే సత్తా అతడిది. అతడు క్రీజులో కుదురుకున్నాడంటే బౌలర్లకు చుక్కలే. కానీ ఇప్పుడతడి పరిస్థితి అలా లేదు. టీనేజీలోనే వచ్చిన పేరు ప్రఖ్యాతులు, డబ్బు అతడిని నిలవనీయలేదేమో! ఆట మీద శ్రద్ధ తగ్గి, శరీరం మీద పట్టు తప్పింది. ఫలితంగా వేగంగానే అతడి కెరీర్ పతనమైపోయింది. ప్రస్తుత ఐపీఎల్‌లోనూ అతడిని ఎవరూ ఆసక్తి చూపని స్థాయికి పడిపోయింది. కాబట్టి, ఇంకా చెప్పాలంటే సచిన్‌కు ఏమాత్రం తీసిపోనివాడే అయినా, సచిన్‌కున్న క్రమశిక్షణ, పట్టుదల లేక అప్పట్లో వినోద్ కాంబ్లీ ఏమయ్యాడో తెలుసు కదా? అతడిని పోలిన కథే ఇప్పుడు పృథ్వీ షాది!
యశస్వి అలా చేయలేదు! - కానీ పృథ్వీ షాతో పాటు వచ్చిన యశస్వి జైస్వాల్ అలా కాదు. సచిన్ 'ప్రతిభ కన్నా క్రమశిక్షణ ముఖ్యం' మంత్రం యశస్వి బాగా వంటబట్టించుకున్నాడు! వాస్తవానికి పృథ్వీ షాలాగానే యశస్విది సామాన్య నేపథ్యమే. షా తరహాలోనే ఎంతో కష్టపడ్డాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన అతడు, పదేళ్ల వయసులో క్రికెట్ పిచ్చితో ఇంటి నుంచి పారిపోయి ముంబయికి వెళ్లి కష్టపడ్డాడు. శ్రమ, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలను విడిచిపెట్టకుండా ముందుకు సాగాడు.
ముంబయి తరఫున దేశవాళీ క్రికెట్లో అవకాశం దక్కించుకున్నాడు. అక్కడ సత్తా చాటి, ఐపీఎల్‌లోనూ అవకాశం అందుకున్నాడు. అక్కడ కూడా అద్భుతంగా రాణించి టీమ్‌ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే కీర్తి, డబ్బు అతడి ఏకాగ్రతను అస్సలు దెబ్బ తీయలేకపోయాయి. వెస్టిండీస్‌తో తన అరంగేట్రానికి ముందు, అలానే ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగిన కఠిన సిరీస్ ముంగిట, ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలోనూ అతను ఎంతగానే కష్టపడ్డాడు, ఇంకా కష్టపడుతున్నాడు.