IPL 2024 Rohith Sharma :ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన ఐపీఎల్ మాజీ టీమ్ డెక్కన్ ఛార్జర్స్‌పై ప్రేమను చాటుకున్నాడు. ఐపీఎల్‌లో తాను ఇప్పటివరకు విన్న థీమ్ సాంగ్‌లలో డెక్కన్ ఛార్జర్స్‌దే బెస్ట్ థీమ్ సాంగ్ అని తెలిపాడు. క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్‌కాస్ట్‌లో ఈ విషయాన్ని తెలిపాడు.
ఈ పోడ్‌కాస్ట్‌లో రోహిత్ శర్మతో పాటు మాజీ క్రికెటర్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్, మైఖేల్ వాన్ సహా మరికొంతమంది పాల్గొన్నారు. దీనిని క్లబ్ ప్రైరీ ఫైర్ అనే యూట్యూబ్ ఛానెల్ హోస్ట్ చేసింది. వీడియో ఇంటర్వ్యూలో భాగంగా డెక్కన్ ఛార్జర్స్ థీమ్ సాంగ్‌ను ఆడమ్ గిల్‌క్రిస్ట్ ప్లే చేశాడు. దీనిని హిట్ మ్యాన్ బాగా ఎంజాయ్ చేశాడు.
ఈ క్రమంలోనే హిట్ మ్యాన్ మాట్లాడుతూ - "అప్పటి ఐపీఎల్ థీమ్ సాంగ్స్ చాలా బాగుండేవి. ప్రస్తుతం అలాంటి సాంగ్ రాలేదు. నాకు తెలిసి డెక్కన్ ఛార్జర్స్ థీమ్‌కు మరే ఇతర ఐపీఎల్ థీమ్ సాంగ్ సాటి రాదు. ఇదే బెస్ట్. ఈ సాంగ్ నాకు ఇప్పటికీ గుర్తుంది. అని తన అభిప్రాయాన్ని" తెలిపాడు. కాగా, ఐపీఎల్ ప్రారంభంలో డెక్కన్ ఛార్జర్స్ తరఫున గిల్‌క్రిస్ట్, రోహిత్ ఆడిన సంగతి తెలిసిందే.