IPL 2024 Punjab Kings VS LSG :లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ యంగ్ పేసర్ మయాంక్ యాదవ్ తన ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. ఐపీఎల్-2024 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఎంట్రీ ఇచ్చిన అతడు తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను బంబేలెత్తించాడు. 150 కి.మీ పైగా వేగంతో బంతులు సంధించి పంజాబ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
అతడు వేగవంతమైన బంతిని సంధించి ఇప్పటివరకు ఐపీఎల్-2024లోనే ఫాసెస్ట్ డెలివరీ వేసిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. 12వ ఓవర్ తొలి బంతికి 155.8 కి.మీ. వేగంతో బంతిని విసిరాడు. కీలకమైన జానీ బెయిర్‌స్టోను ఔట్ చేసి ఐపీఎల్‌లో తన తొలి వికెట్‌ను తీశాడు. అలాగే, పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్‌ను కూడా ఇబ్బంది పెట్టాడు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ వికెట్ కూడా దక్కించుకున్నాడు. జితేష్ శర్మను కూడా పెవిలియన్‌కు పంపి లఖ్‌నవూ వైపునకు మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మొత్తంగా తన 4 ఓవర్ల కోటాలో బౌలింగ్ వేసి 27 పరుగులు ఇచ్చి కీలకమైన 3 వికెట్లు దక్కించుకున్నాడు. అంతకుముందు ఈ ఫాసెస్ట్ డెలివరీ రికార్డు రాజస్థాన్ పేసర్ నండ్రీ బర్గర్(153 కి.మీ వేగం) పేరిట ఉండేది.
అసలు ఎవరీ మయాంక్ యాదవ్? ఇతడి వయసు 21 ఏళ్లు. దిల్లీలో జూన్ 17, 2002న జన్మించాడు. దేశీవాళీ క్రికెట్‌లో దిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆ జట్టు తరపున మూడు ఫార్మాట్లలోనూ అతడు అరంగేట్రం చేశాడు. మొదట రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో ఆడాడు. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌తో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అనంతరం లిస్ట్-ఏ, టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. మంచి పేసర్‌గా గుర్తింపు సాధించాడు.