IPL 2024 KL Rahul : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ మధ్యలో గాయం కారణంగా టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ వైదొలిగిన సంగతి తెలిసిందే. అతడు మళ్లీ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలంటే తన ఫిట్నెస్ను నిరూపించుకోవాలి. అలాగే ఐపీఎల్‌లోనూ ఆడాలన్నా కూడా అతడికి ఫిట్నెస్ ఉండాల్సిందే. తొందరపడి ఈ మెగాలీగ్‌లో పాల్గొంటే రిస్క్ తీసుకున్నట్టే. ఎందుకంటే ఐపీఎల్ తర్వాత జరగబోయే పొట్టి కప్‌లో అతడు వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా ఎంతో కీలకం. అయితే రాహుల్ ఐపీఎల్ ఆడే అవకాశం లేదని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ వర్గాలు రాహుల్ గురించి ఓ కీలక అప్డేట్ను ఇచ్చాయి. అతడు తాజాగా లండన్ వెళ్లి స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకుని భారత్‌కు తిరిగి వచ్చినట్లు పేర్కొన్నాయి.
KL Rahul Treatment : "లండన్‌లోని ది బెస్ట్ డాక్టర్స్‌ను కేఎల్ సంప్రదించాడు. రీసెంట్‌గానే అతడు భారత్‌కు తిరిగొచ్చాడు. బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లాడు. త్వరలోనే రాహుల్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన రిపోర్ట్‌ను ఎన్సీఏ ఇవ్వనుంది. అతడు ఐపీఎల్లో తన సత్తాను నిరూపించుకోవాలని ఆశపడుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ కీపర్-బ్యాటర్‌గా బరిలోకి దిగాలను అనుకుంటున్నాడు. ఇదంతా జరగాలంటే అతడు ముందు ఫిట్నెస్ సాధించి ఎన్సీఏ నుంచి రిటర్న్ టు ప్లే సర్టిఫికెట్‌ను తీసుకోవాల్సి వస్తుంది" అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌తో మార్చి 24న లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మ్యాచ్ ఆడనుంది. లఖ్‌నవూకు రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.