IPL 2024 RCB Playoffs : ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శన ఊహించని విధంగా సాగుతోంది. ఫస్ట్ ఆఫ్‌లో పేలవ ప్రదర్శనతో వరుస ఓటములను అందుకున్న ఆ జట్టు సెకండాఫ్‌లో అదిరే ప్రదర్శన చేస్తోంది. మొదటి 8 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించిన ఆ జట్టు తర్వాతి ఐదు మ్యాచుల్లో మాత్రం ఐదింటిలో గెలిచింది. తద్వారా ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది.
చివరిగా ఆదివారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో భారీ రన్‌రేట్‌తో గెలిచి ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ సెంటిమెంట్ ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే ఆర్సీబీ వరుస విజయాలు సాధించిన ప్రతీసారి ప్లే ఆఫ్స్ చేరడం లేదా ఫైనల్ చేరుతుంది. 2011 సీజన్‌లో బెంగళూరు జట్టు వరుసగా 7 మ్యాచుల్లో గెలిచి ఫైనల్ చేరింది. కానీ టైటిల్ పోరులో మాత్రం ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2009 సీజన్‌లోనూ వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. కానీ అప్పుడు కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2016లోనూ ఐదు మ్యాచులు వరుసగా గెలిచి ఫైనల్‌కు వెళ్లింది. అయితే అక్కడ కూడా ఓడిపోయింది. అందుకే ప్రస్తుతం సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచులు గెలిచిన నేపథ్యంలో ఈ సారి కూడా ఆర్సీబీ ఫైనల్ వెళ్తుందని అంతా ఆశిస్తున్నారు.
ఇక 2010, 2021లోనూ వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. అందుకే ఇదే సెంటిమెంట్ కొనసాగితే ఈసారి కూడా ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌తో పాటు ఫైనల్ చేరుతుందని ఆ జట్టు అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.