Paralympics India 2024:2024 పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్లు అదరగొడుతున్నారు. విశ్వక్రీడలు ప్రారంభమైన రెండో రోజే పతకాల ఖాతా తెరిచారు. పారా షూటర్ అవని లెఖరా శుక్రవారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పసిడి పతకం నెగ్గింది. ఈ ఈవెంట్లో 249.7పాయింట్లతో అవని సత్తా చాటింది. గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ గోల్డ్ నెగ్గిన అవని, ఈసారి పారిస్‌లోనూ సత్తా చాటి పసిడి ముద్దాడింది. టోక్యోలో 249.6పాయింట్లు సాధించిన అవని ఈసారి తన రికార్డును మెరుగుపర్చుకుంది.
ఈ క్రమంలో పారాలింపిక్స్‌లో రెండు గోల్డ్ మెడల్స్ నెగ్గిన రెండో భారత పారా అథ్లెట్‌గా అవని రికార్డు సృష్టించింది. అయితే 11 ఏళ్ల వయసులో కారు ప్రమాదానికి గురికావడం వల్ల అవని కాళ్లు రెండూ చచ్చుబడిపోయాయి. అప్పటి వరకు ఆమె లోకం వేరు! చదువు తప్ప వేరే ధ్యాస లేదు. ఆ తర్వాత ఆమె ఆర్చరీవైపు దృష్టి పెట్టి దీన్నే కెరీర్‌గా మలుచుకుంది. ఇక మరోవైపు ఇదే ఈవెంట్లో మోనా అగర్వాల్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం ముద్దాడింది. ఈమె 228.7 పాయింట్లు సాధించింది. ఇక సౌత్ కొరియా పారా అథ్లెట్ యె లీ (Y Lee) 246.8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ పతకం దక్కించుకుంది.
పరుగులో ప్రీతి
స్ప్రింటర్ ప్రీతి పాల్ 100 (T35) మీటర్ల పరుగు పందెంలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకుంది. ఈ ఈవెంట్లో ప్రీతి ఆమె 14.21 సెకన్లలో పరుగు పూర్తి చేసింది. కాగా, ఈ విభాగంలో ఇదే ప్రీతి బెస్ట్ టైమ్. ఇక తొలి రెండు స్థానాలను చైనాకు చెందిన అథ్లెట్లు కైవసం చేసుకున్నారు. రేస్‌ను 13.58 సెకన్లలో ముగించిన జియా జౌ పసిడి ముద్దాడగా, 13.74 సెకన్లలో పరుగును పూర్తి చేసిన గౌ రజకం దక్కించుకుంది.