Kho Kho World Cup 2025:2025 ఖోఖో ప్రపంచకప్ టోర్నీలో భారత్ డబుల్ బొనాంజా కొట్టింది. ఆదివారం జరిగిన రెండు ఫైనల్స్‌లోనూ భారత జట్లే విజేతలుగా నిలిచాయి. ముందుగా అమ్మాయిల జట్టు టైటిల్ చేజిక్కించుకుంది. ఆదివారం దిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో భారత్ 78- 40 తేడాతో నేపాల్‌ను చిత్తు చేసి, తొలి ఛాంపియన్‌గా నిలిచింది. కాగా, ఖోఖో వరల్డ్‌కప్ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
తుది పోరు టర్న్- 1లో భారత్ దూకుడుగా ఆడి 34- 0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. తర్వాత నేపాల్ పుంజుకోవడం వల్ల 35- 24తో రెండో టర్న్ ముగిసింది. మూడో టర్న్‌లో భారత్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. దూకుడు పెంచి వరుసగా పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని 49కి పెంచుకుంది. ఇక చివరి టర్న్‌లో నేపాల్ 16 పాయింట్లు సాధించడంతో 38 పాయింట్లతో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టి, విజేతగా అవతరించింది.
అబ్బాయిలూ విశ్వ విజేతలే
మహిళలు నెగ్గిన కాసేపటికే భారత పురుషుల జట్టు కూడా ఛాంపియన్‌గా అవతరించింది. నేపాల్‌తో ఫైనల్‌లో తలపడ్డ భారత్ విజేతగా నిలిచింది. దిల్లీ వేదికగా నేపాల్‌తో జరిగిన ఫైనల్ పోరులో పురుషుల జట్టు విజయఢంకా మోగించింది. 54- 36 తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది. తొలి రౌండ్‌లో 26 -18 ఆధిక్యంతో నిలిచిన భారత్ అదే జోరును చివరి వరకు కొనసాగించింది.
మూడో రౌండ్ ముగిసే సమయానికి 56-18 లీడ్‌లోకి వెళ్లింది. అయితే, నాలుగో రౌండ్‌లో అటాకింగ్‌కు దిగిన నేపాల్ 37 పాయింట్లు సాధించాల్సి ఉండగా.. కేవలం మరో 18 పాయింట్లు మాత్రమే రాబట్టగలిగి 36 వద్ద చేతులెత్తేసింది.దీంతో భారత్ కప్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఇక్కడ మహిళల, పురుషుల ప్రత్యర్థి జట్లు నేపాల్‌వే కావడం గమనార్హం.
ఈ విజయంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. 'మొట్ట మొదటిసారిగా ఖో ఖో ప్రపంచ కప్ నెగ్గిన భారత మహిళా జట్టుకు అభినందనలు! ఈ చరిత్రాత్మక విజయంలో నైపుణ్యం, దృఢ సంకల్పం, జట్టు కృషి ఉంది' అని మోదీ ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు.