Shahid Afridi About Team India : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో టీమ్ఇండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ షాహీద్ అఫ్రిదీ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమ్ఇండియాపై ప్రశంసలు కురిపించాడు. పాకిస్థాన్‌తో పోలిస్తే టీమ్ఇండియాలో ఎక్కువ మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారని కొనియాడాడు.
'ఆ టీమ్‌లో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు'
"పాకిస్థాన్‌తో పోలిస్తే భారత్‌లో ఎక్కువ మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారని నేను చెబుతాను. మ్యాచ్ విన్నర్ అంటే ఒంటి చేత్తో గేమ్ గెలిపించే ప్లేయర్. ప్రస్తుతం పాకిస్థాన్ లో మ్యాచ్ విన్నర్లు లేరు. టీమ్ఇండియా బలం మిడిల్, లోయర్ బ్యాటర్లు. అందుకే భారత్ మ్యాచ్‌లను గెలుస్తోంది. చాలా కాలంగా పాకిస్థాన్ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నాం. కానీ ఎవరూ స్థిరంగా రాణించడం లేదు. కొందరు కొన్ని మ్యాచ్‌ల్లో రాణిస్తున్నారు. 50-60 మ్యాచ్‌లలో నిలకడగా ఆడే ప్లేయర్స్ పాక్‌లో లేరు." అని అఫ్రిదీ వ్యాఖ్యానించాడు.
భారత్‌పై గెలవాలంటే అదే కీలకం : అఫ్రిదీ
టీమ్ఇండియా చాలా బలంగా ఉందని అఫ్రిదీ కొనియడాడు. నిలకడగా ఆడే బ్యాటర్ల విషయంలో భారత్‌తో పోలిస్తే పాక్ జట్టు చాలా బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డాడు. భారత్‌పై గెలవడానికి టీమ్ మొత్తం బాగా పెర్ఫామ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. బ్యాటర్లు, బౌలర్లు, స్పిన్నర్లు అందరూ రాణిస్తే భారత్‌పై విజయం సాధించొచ్చని అభిప్రాయపడ్డాడు.