India Vs New Zealand Test Series : సుమారు 36 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై టీమ్ఇండియా ఘోర పరాభవాన్ని చూసింది. న్యూజిలాండ్‌తో ఇటీవలె జరిగిన తొలి టెస్ట్‌లో ఓటమిపాలై క్రీడాభిమానులను నిరాశపరిచింది. అంతకుముందు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ క్లీన్ స్వీప్ అయ్యింది. అయితే రోహిత్, విరాట్, రాహుల్ ఇలా టాప్ ప్లేయర్లు ఉన్నా కూడా శ్రీలంక మన ప్లేయర్లకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు న్యూజిలాండ్ కూడా టీమ్ఇండియాకు గట్టిపోటీనిస్తోంది.
అయితే బెంగళూరు టెస్టు తర్వాత న్యూజిలాండ్‌ను ఇబ్బంది పెట్టేందుకు పూర్తిగా స్పిన్ పిచ్‌ని తయారుచేసింది టీమ్ఇండియా. కానీ టాస్ ఓడిపోవడం వల్ల ఇప్పుడు ఈ ప్లాన్ కూడా బెడిసికొట్టేలా కనిపిస్తోందని విశ్లేషకుల మాట.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు 259 పరుగులు చేసింది. తొలి టెస్టు తర్వాత బాధ్యతగా ఆడాల్సిన సీనియర్లు, రెండో టెస్టులోనూ నిరాశపరిచారు. బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఇప్పుడీ పుణె టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుతిరిగాడు.
అయితే బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరూ 50+ స్కోర్లతో రాణించినప్పటికీ, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం పేలవ ఫామ్ కనబరిచారు. పుణె టెస్టులో రోహిత్ శర్మ డకౌట్ కాగా, నాలుగో స్థానంలో క్రీజులోకి దిగిన విరాట్ కేవలం 1 పరుగు చేసి పెవిలియన్ బాట పట్టాడు.
ఇదిలా ఉండగా, గత 10 టెస్టు ఇన్నింగ్స్‌లో కలిపి ఈ ఇద్దరూ 25కి కాస్త అటు ఇటు సగటుతోనే పరుగులు చేయడం గమనార్హం. ఇక గత 10 టెస్టుల్లో విరాట్ 26.6 సగటుతో 266 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ధ సెంచరీ ఉంది. అయితే రోహిత్ శర్మ 2 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో 25.6 సగటుతో 256 పరుగులు స్కోర్ చేశాడు.