India Vs New Zealand 2nd Test : తాజాగా జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమ్ఇండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఎంతో శ్రమించినా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో తప్పెక్కడ జరిగిందో అని విశ్లేషించుకునే పనిలో భారత జట్టు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని రానున్న మ్యాచ్‌లకు సర్దుబాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జట్టులో కొన్ని మార్పులు తప్పకపోవచ్చని క్రికెట్ వర్గాల మాట.
జరగనునన్న మార్పులు ఇవే!
అయితే ఈ సారి హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. విదేశీ పేస్ పిచ్‌లపై రాణించినట్లు స్వదేశీ వికెట్లపై సత్తా చాటలేకపోతున్నందున ఈ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. సొంతగడ్డపై 13 టెస్ట్‌లు ఆడిన ఈ స్టార్ క్రికెటర్ కేవలం 19 వికెట్లను మాత్రమే తన ఖాతాలో వేసుకున్నాడు. విదేశాల్లో మాత్రం అతను 17 టెస్టుల్లోనే 61 వికెట్లు తీయడం విశేషం.
ఇటీవల భారత పిచ్‌లు కొంత పేస్‌కు అనుకూలిస్తున్నప్పటికీ సిరాజ్ పెద్దగా రాణించలేకపోతున్నాడు. కివీస్‌తో తొలి టెస్టులో అతను కేవలం 2 వికెట్లే తీశాడు. అయితే అనుభవం దృష్ట్యా సిరాజ్‌నే సెలక్టర్లు ఎంపిక చేసుకుంటున్నప్పటికీ, ఫామ్ ప్రకారం చూస్తే యంగ్ ప్లేయర్ ఆకాశ్‌దీప్‌కు ఈ ఛాన్స్ ఇవ్వాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆడిన మూడు టెస్టుల్లో ఆకాశ్ 23.12 సగటుతో 8 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూడు మ్యాచ్‌లూ స్వదేశంలో ఆడినవే కావడం విశేషం.
ఇదిలా ఉండగా, పుణె మ్యాచ్‌లో ఇద్దరు పేసర్లకే స్థానం ఇవ్వలనుకుంటే అప్పుడు బుమ్రాకు తోడుగా సిరాజ్ స్థానంలో ఆకాశ్‌ను ఆడించాలనేదే అభిమానుల వాదన. జట్టు యాజమాన్యం కూడా ఈ విషయంలో సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.