తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో టెస్ట్​కు బ్లాక్ సాయిల్ పిచ్​ - ఇక్కడ వికెట్​ ఎలా ఉంటుంది? ఎవరికి అనుకూలం? - India vs Bangladesh 2nd Test

IND VS BAN Kanpur Test Pitch : చెన్నై చెపాక్‌ స్టేడియం వేదికగా బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో గెలిచిన టీమ్ ఇండియా ఇప్పుడు రెండో మ్యాచ్​కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్​కు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. పూర్తి వివరాలు స్టోరీలో

source Associated Press
IND VS BAN (source Associated Press)

By ETV Bharat Sports Team

Published : Sep 25, 2024, 7:11 AM IST

IND VS BAN Kanpur Test Pitch : చెన్నై చెపాక్‌ స్టేడియం వేదికగా జరిగిన భారత్ - బంగ్లా తొలి టెస్ట్​ ఆటగాళ్లకే కాదు ఫ్యాన్స్​కు కూడా కొత్త అనుభవం ఇచ్చిందనే చెప్పాలి! ఈ ఆసక్తికరమైన పోరులో గట్టి సవాళ్లు ఎదురైనా మనోళ్లు గెలిచారు. ముఖ్యంగా ఈ పోరుకు ఆతిథ్యమిచ్చిన మైదానంలో ఎర్ర మట్టితో కొత్తగా పిచ్‌ తయారు చేయడంతో బంతి బాగా బౌన్స్‌ అయింది. దీంతో పేసర్లు ప్రమాదకరంగా మారారు.

ఫలితంగా తొలి రెండు రోజులు పేసర్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు పెద్ద సవాలుగా మారింది. స్పిన్నర్ల ప్రభావం ఆలస్యంగా కనిపించింది. చెన్నై వేదికపై బ్యాటింగ్‌ ఇంత ఇబ్బందిగా ఉండటం, పేసర్లు అంత జోరు చూపించడంతో కొత్త అనుభవం ఎదురైంది.

అయితే ఇప్పుడు రెండో టెస్టుకు భారత్ - బంగ్లా సిద్ధమవుతోంది. కాన్పూర్‌ మైదానం వేదికగా ఇది జరగనుంది. మరి మైదానంలో వికెట్‌ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో మొదలైంది. శుక్రవారం(సెప్టెంబర్ 27) నుంచి ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

పిచ్ ఎలా ఉంటుందంటే? - అయితే ఇక్కడి పిచ్‌ సంప్రదాయ శైలిలోనే ఉంటుందని సమాచారం. ఎప్పట్లాగే బ్యాటర్లు తమ జోరు చూపిస్తారని, పరుగుల వరద పారుతుందని తెలుస్తోంది. మ్యాచ్‌ సాగే కొద్దీ స్పిన్నర్ల ప్రభావం పెరుగుతుందని స్టేడియం వర్గాలు అంటున్నాయి. చెన్నైలో పిచ్‌ను మార్చే నేపథ్యంలో ముంబయి నుంచి ఎర్ర మట్టిని(రెడ్ సాయిల్) తీసుకొచ్చి వినియోగించగా అక్కడ వికెట్‌ బౌన్సీగా మారింది.

కానీ కాన్పూర్‌లో మాత్రం అలా కాదు. చాలా కాలం నుంచి ఉన్న పిచ్‌నే ఉపయోగిస్తున్నారు. ఇది నల్లమట్టితో ఉంటుంది. ఈ పిచ్‌పై బంతి మరీ వేగంగా ఉండదు. బౌన్స్‌ కూడా ఎక్కువ అవ్వదు. దీంతో ఇక్కడ బ్యాటింగ్‌ చేయడం సులువగా ఉంటుందని, క్రీజులో కుదురుకుంటే పెద్ద స్కోర్లు చేయొచ్చని, మొత్తంగా మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే ఛాన్స్​లు ఉన్నాయని చెబుతున్నారు.

ఈ సారి మూడో స్పిన్నర్​తో - మ్యాచ్‌ సాగేకొద్దీ బంతి బాగా తిరుగుతుందన్న నేపథ్యంలో రెండు జట్లు కూడా కూర్పును మార్చుకునే అవకాశముందట. మొదటి టెస్టుకు ఇరు జట్లూ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగారు. కాన్పూర్‌లో ఒక పేసర్‌ను తగ్గించుకుని మూడో స్పిన్నర్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది. ఆకాశ్‌ దీప్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌ లేదా కుల్‌దీప్‌ యాదవ్‌ రావొచ్చు. బంగ్లాదేశ్‌ నహిద్‌ రాణా స్థానంలో తైజుల్‌ ఇస్లామ్‌ లేదా నయీమ్‌ను రావొచ్చు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌హసన్‌ ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి అతడు అందుబాటులో లేకుంటే వీరిద్దరు తుది జట్టులోకి చేరొచ్చు.

కాన్పూర్‌ చేరుకున్న భారత్, బంగ్లా జట్లు: చివరిదైన రెండో టెస్టు కోసం భారత్, బంగ్లాదేశ్‌ జట్లు కాన్పూర్‌ చేరుకున్నాయి. పటిష్ట భద్రత మధ్య ఆటగాళ్లను పోలీసులు హోటల్‌కు తీసుకెళ్లారు. జట్లు బుధవారం, గురువారం గ్రీన్‌పార్క్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తాయి. 27న టెస్టు మ్యాచ్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో స్టేడియం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

సర్ఫరాజ్​కు మళ్లీ నిరాశే! - రెండో టెస్ట్​ నుంచి రిలీజ్​ - ఎందుకంటే? - IND VS BAN Sarfaraz Khan

'బుమ్రా బెంజ్ కారు కాదు, టిప్పర్ లారీ!' - కోహ్లీతో పోలికపై అశ్విన్ కామెంట్స్ - Ravichandran Ashwin About Bumrah

ABOUT THE AUTHOR

...view details