తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్ X ఆస్ట్రేలియా - రెండో టెస్ట్​లో నెగ్గేదెవరో - తగ్గేదెవరో? - INDIA VS AUSTRALIA BGT

అడిలైడ్​లో రెండో టెస్ట్​ - భారత్ X ఆస్ట్రేలియా తుది జట్టు అంచనా ఇదే!

India Vs Australia BGT
India Vs Australia BGT (Associated Press)

By ETV Bharat Sports Team

Published : Dec 6, 2024, 7:01 AM IST

India Vs Australia Border Gavaskar Trophy 2nd Test : ప్రతిష్టాత్మక బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా శుక్రవారం రెండో టెస్టు ప్రారంభం కానుంది. అడిలైడ్‌ వేదికగా ప్రారంభంకానున్న డే అండ్‌ నైట్‌ టెస్టు కోసం ఇరుజట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో విజయం, ఆపై పింక్‌ బాల్‌తో ఆస్ట్రేలియా PM ఎలెవన్‌ జట్టుతో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో గెలుపొంది టీమ్​ఇండియా జోరు మీదుంది.

నాలుగేళ్ల క్రితం గత పర్యటనలో ఇదే వేదికపై జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో భారత్ 36 పరుగులకే ఆలౌటై అవమానకరమైన ఓటమిని చవిచూసింది. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ఇండియా భావిస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ అందుబాటులోకి రావడం భారత్‌కు కలిసొచ్చే అంశం.

అడిలైడ్‌ పిచ్‌ స్పిన్నర్లకూ సహకరిస్తుందని ప్రధాన క్యురేటర్‌ డామియన్‌ హో చెప్పారు. పచ్చిక వల్ల ఆరంభంలో పేసర్లకు అనుకూలిస్తుందని తెలిపారు. పిచ్‌పై 6 మిల్లీమీటర్ల పచ్చిక ఉంటుందని ఆరంభంలో పేస్, బౌన్స్‌కు సహకరిస్తుందని వెల్లడించారు. రోజులు గడుస్తున్నకొద్దీ స్పిన్నర్లు కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. కొత్త బంతితో ప్లడ్‌ లైట్ల కింద బ్యాటింగ్ చేయడం బ్యాటర్లకు కష్టంగా మారుతుందని డామియన్ హగ్ పేర్కొన్నారు.

కుటుంబ కారణాలతో తొలి టెస్టుకు దూరమైన రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తిరిగి జట్టులోకి రావడం వల్ల జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు ఉంటాయి. గాయం నుంచి కోలుకున్న శుభమన్‌ గిల్‌తో పాటు రోహిత్‌ తిరిగి జట్టులోకి రావడం వల్ల తొలిటెస్టులో విఫలమైన పడిక్కల్‌, ధ్రువ్‌ జురెల్‌లు బెంచ్‌కే పరిమితం కానున్నారు.

అయితే ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో బరిలో దిగిన రోహిత్‌ రెండోటెస్టులో కూడా డౌన్‌ ది ఆర్డర్‌లో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్‌ బాల్‌ను ఎదుర్కోవడం బ్యాటర్లకు కష్టంగా ఉంటుంది. అనుభవజ్ఞుడైన రోహిత్‌ లోయర్‌ ఆర్డర్‌లో దిగితే జట్టుకు మేలు చేస్తుందని క్రికెట్‌ విశ్లేషకులు అంటున్నారు. ఈ రెండు మార్పులు మినహా భారత్‌ తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టుతోనే ఆడే అవకాశాలు ఉన్నాయి. అడిలైడ్‌ వేదికపైనా, పింక్‌ బాల్‌ టెస్టుల్లోనూ మంచి రికార్డు ఉన్న విరాట్‌ కోహ్లీపై అందరీ దృష్టి పడింది.

ఇదిలా ఉండగా, తొలి మ్యాచ్‌లో అనుహ్య ఓటమి చవిచూసిన ఆస్ర్టేలియా రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని చూస్తోంది. తొలి టెస్టు ఓటమి తర్వాత ఆసీస్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో వివాదాలు ఉన్నట్లు వార్తాలు వస్తున్న నేపథ్యంలో ఒత్తిడిలో ఉన్న ఆ జట్టు ఎంతమేర రాణిస్తుందో చూడాలి.

ఇక భారత్‌తో అడిలైడ్‌ వేదికగా జరిగిన గత పింక్‌ టెస్టులో ఐదు వికెట్లతో సత్తాచాటిన జోష్ హేజిల్‌వుడ్‌ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరం కావడం ఆసీస్‌ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. అతని స్థానంలో తుది జట్టులో పేసర్‌ స్కాట్ బోలాండ్‌కు అవకాశం దక్కింది. ఒక్కమార్పు మినహా తొలి టెస్టులో బరిలోకి దిగిన జట్టే రెండో టెస్టులోనూ ఆడనుంది.

రోహిత్, రాహుల్ ఓపెనింగ్ ఎవరు?- క్లారిటీ ఇచ్చేసిన హిట్​మ్యాన్

బీసీసీఐ స్ట్రాంగ్ డెసిషన్ - ఇకపై ప్రాక్టీస్ సెషన్​లో వాళ్లకు నో ఎంట్రీ!

ABOUT THE AUTHOR

...view details