India Tennis Journey In Olympics :ఒలింపిక్స్‌లో టెన్నిస్ జర్నీ అంతంతమాత్రంగానే ఉంది. 1996లో లియాండర్ పేస్ గెలిచిన కాంస్యమే ఇప్పటివరకూ ఒలింపిక్స్ టెన్నిస్‌లో భారత్‌కు దక్కిన పతకం కావడం క్రీడాభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆ తర్వాత మరో పతకం కోసం టెన్నిస్ ప్లేయర్లు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. అయితే పోటీపడ్డ ప్రతిసారీ నిరాశ తప్ప వారికి ఏం మిగలట్లేదు. దీంతో ఫ్యాన్స్‌కు కుడా ఈ ఆటపై తక్కువ అంచనాలే ఉన్నాయి.
రానున్న ఒలింపిక్స్‌లో సుమిత్ నగాల్, రోహన్ బోపన్న- శ్రీరామ్ బాలాజి జోడీలు కాస్త ఆశలు రేపుతున్నప్పటికీ వారు రాణించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, ఈ సారి మహిళల టెన్నిస్‌లో భారత్ నుంచి ప్రాతినిథ్యమే లేకపోవడం గమనార్హం.
సింగిల్స్‌లో సుమిత్ నగాల్ గత కొంతకాలం నుంచి నిలకడగా రాణిస్తున్నాడు. అయితే ఇతడి ఫామ్ ఒలింపిక్స్‌లోనూ అలానే ఉంటుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. అల్కరాస్, జకోవిచ్, సినర్ లాంటి స్టార్ ప్లేయర్స్‌ను దాటి మెడల్ సాధించడం అంత సులువైన విషయం కాదు.
ఇక ఈ ఏడాది ఆరంభంలో 138వ ర్యాంక్‌తో ఉన్న 26 ఏళ్ల నగాల్, తాజాగా 68వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఇది కాకుండా, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రధాన డ్రాకు అర్హత సాధించి, తొలి రౌండ్లో తనకంటే మెరుగైన ర్యాంకులో ఉన్న అలెగ్జాండర్ బబ్లిక్‌పై గెలుపొందాడు.
చెన్నై ఛాలెంజర్ ట్రోఫీ విజేత నగాల్ మొదటిసారి టాప్-100లో ఎంట్రీ ఇచ్చాడు. దీంతో పాటు జర్మనీలో మరో ఛాలెంజర్ టోర్నీని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే నేరుగా ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌కు అర్హత సాధించినప్పటికీ, ఎందులోనూ తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. తాజాగా స్వీడిష్ ఓపెన్ ప్రిక్వార్టర్స్‌లోనూ ఓటమిని చవిచూశాడు.
ఇదిలా ఉండగా, వరుసగా రెండో సారి ఒలింపిక్స్‌లో పాల్గొననున్న నగాల్ ఈ ఈవెంట్లో తనదైన ముద్ర వేయాలనే కసితో ఉన్నాడు. టోక్యోలో రెండో రౌండ్లో వెనుతిరిగినప్పటికీ, క్లే కోర్టుపై అతనికి మంచి రికార్డుంది. ఎర్రమట్టి కోర్టులోనే జరిగే ఈ ఒలింపిక్స్ టెన్నిస్‌లో అతను ఎంతవరకూ వెళ్తాడన్నది ఆసక్తికరంగా మారింది.
బోపన్న ఏం చేస్తాడో!
లేటు వయసులోనూ విజయాల కిక్ ఇస్తున్నాడు స్టార్ ప్లేయర్ రోహన్ బోపన్న. మూడోసారి ఒలింపిక్స్ బరిలో దిగబోతున్న బోపన్న, డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజితో కలిసి పోడియంపై నిలబడాలని అభిమానులు ఆశిస్తున్నారు. 2012, 2016 ఒలింపిక్స్‌లో పాల్గొన్న రోహన్, 2016లో సానియా మీర్జాతో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆడి పతకానికి చేరువగా వచ్చాడు.
తొలుత సెమీస్, ఆ తర్వాత కాంస్య పతక పోరులో ఈ జోడీ ఓడింది. మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి ఇటీవల డబుల్స్‌లో బోపన్న అద్భుత ఫామ్ కనబరిచారు. అలా ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్‌తో రికార్డుకెక్కాడు. నంబర్‌వన్ ర్యాంకును సాధించాడు. అంతే కాకుండా ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ వరకూ వెళ్లాడు.
మరోవైపు ATP టూర్ టోర్నీల్లో బాలాజి రాణిస్తున్నాడు. ఇతడు మియామి మాస్టర్స్ టైటిల్ గెలిచాడు. అయితే ఒలింపిక్స్ కోసం జతకట్టిన బోపన్న- బాలాజి జంట గతంలో ఎప్పుడూ కలిసి ఆడలేదు. ఒలింపిక్స్‌కు సన్నాహకంగా తాజాగా హంబర్గ్ యూరోపియన్ ఓపెన్‌లో అడుగుపెట్టిన ఈ ద్వయం తొలి రౌండ్లోనే వెనుతిరిగారు. ఈ నేపథ్యంలో పారిస్‌లో ఈ ఇద్దరి మధ్య సమన్వయం కీలకం కానుంది. ఈ వయసులోనూ అద్భుతాలు సృష్టిస్తున్న బోపన్న ఒలింపిక్ పతకంతో కెరీర్‌ను పరిపూర్ణం చేసుకుంటాడేమో వేచి చూడాల్సిందే.
ఒలింపిక్స్‌కు హై సెక్యూరిటీ- పారిస్‌లో ఇండియన్ డాగ్ స్వ్కాడ్- డ్యూటీలో 45వేల మంది పోలీసులు! - 2024 Paris Olympics
పారిస్ ఒలింపిక్స్‌కు 70వేల కోట్ల ఖర్చు- హిస్టరీలో రిచ్చెస్ట్ సీజన్ ఇదే! - PARIS OLYMPICS 2024