Bumrah Champions Trophy 2025 :2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు హైబ్రిడ్ మోడల్‌లో జరగనుంది. టీమ్‌ఇండియా మ్యాచ్‌లు మాత్రం దుబాయ్‌లో జరుగుతాయి. ఇప్పటికే ఆయా టీమ్‌లు ఛాంపియన్స్ ట్రోఫీ జట్లను ప్రకటించాయి. భారత్ కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. కొంత మంది ఆటగాళ్ల ఫిట్‌నెస్ అప్డేట్ కోసం ఎదురు చూస్తోంది.
ఈ క్రమంలో కొన్ని వార్తలు భారత అభిమానులను షాక్‌కి గురి చేశాయి. అద్భుత ఫామ్‌లో ఉన్న జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడం సందేహంగా ఉంది. బుమ్రాకు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించినట్లు సమాచారం. ఇటీవల ముగిసిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో బుమ్రా సంచలన ప్రదర్శన చేశాడు. 32 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అందుకున్నాడు. చివరి టెస్టు జరుగుతున్నప్పుడు బుమ్రా గాయపడ్డాడు. చివరిలో బౌలింగ్ చేయలేకపోయాడు.
'బుమ్రాకి బెడ్ రెమరింత స్ట్ అవసరం. బుమ్రా బెంగుళూరులోని బీసీసీఐకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే అతడు ఎప్పుడు చేరుతాడనేది కూడా ఇంకా కన్ఫార్మ్ కాలేదు. బుమ్రా వచ్చే వారం CoEకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కండరాలు కోలుకోవడానికి, వాపు తగ్గడానికి సమయం పడుతుంది. ఆ తర్వాతే బుమ్రా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది'
'బుమ్రా గాయం అతడిని ఊహించిన దాని కంటే ఎక్కువ కాలం ఆటకు దూరంగా ఉంచవచ్చు. మొదట్లో బుమ్రా గాయాన్ని వాపుగా భావించారు, అయితే ఇది డిస్క్ ఉబ్బడం లేదా హైయర్-గ్రేడ్ కండరాల వాపు వంటి తీవ్రమైన సమస్య కావచ్చనే ఆందోళనలు పెరుగుతున్నాయి. మరింత గాయం కాకుండా పూర్తిగా కోలుకునేలా బుమ్రా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది'అని నివేదికలు పేర్కొన్నాయి.