తెలంగాణ

telangana

ETV Bharat / sports

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ: భారత్ జట్టు ఎంపికపై ఉత్కంఠ- వాళ్లకు ఛాన్స్ దక్కేనా? - BORDER GAVASKAR TROPHY 2024

నవంబర్​లో ఆసీస్ పర్యటనకు భారత్- జట్టు ఎంపికపైనే అందరి దృష్టి- ఎవరెవరు రేసులో ఉన్నారంటే?

IND VS AUS
IND VS AUS (Source: Associated Press)

By ETV Bharat Sports Team

Published : Oct 23, 2024, 10:10 PM IST

Border Gavaskar Trophy 2024 India :2025 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ మూడో సీజన్‌లోనూ ఫైనల్‌ చేరడంపై దృష్టిసారించిన భారత్​కు అతిపెద్ద సవాలు నవంబర్​లో ఎదురుకానుంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఈ క్రమంలో జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలు బాగానే ఉన్నప్పటికీ, ఒకే ఒక్కటి ఫ్యాన్స్‌ను కలవరపాటుకు గురిచేస్తోంది. అదేంటి? తుది జట్టులో మన తెలుగు కుర్రాడికి అవకాశాలు ఉంటాయా? తదితర విషయాలు తెలుసుకుందాం.

బ్యాటర్లు వీరే
ఆసీస్ గడ్డపై భారత బ్యాటర్లకు పెద్ద పరీక్ష ఎదురుకానుంది. లోతైన బ్యాటింగ్‌ ఉంటేనే ఆ జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించొచ్చు. గతంలో టీమ్‌ఇండియా 36 పరుగులకే ఆలౌటైన సందర్భం కూడా ఉంది. అలాంటి ఫీట్‌ మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే బ్యాటింగ్‌ విభాగం మరింత బలంగా ఉండాలి. ఈ విషయంలో ఇప్పటికే టీమ్ఇండియా తన ఆయుధాలను సిద్ధం చేస్తున్నట్లుగానే ఉంది. అయితే సీనియర్లు రహానె, పుజారా లేకుండా ఆసీస్ పర్యటన వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

రహానె వచ్చేనా?
ఇటీవల రహానె సోషల్ మీడియా వేదికగా 'నేను రెడీ' అని పోస్టు పెట్టాడు. అది కాస్త వైరల్​గా మారింది. దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న రహానెను ఆస్ట్రేలియా సిరీస్​కు ఎంపిక చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. మరి మేనేజ్‌మెంట్ ఏం చేస్తుందో చూడాలి. అయితే ఆసీస్ సిరీస్​కు కూడా ప్రస్తుతం న్యూజిలాండ్​తో ఆడుతున్న టీమ్​ను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండడనే వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే అభిమన్యు ఈశ్వరన్‌ లేదా రుతురాజ్ గైక్వాడ్‌లో ఒకరికి ఛాన్స్‌ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు జట్టును బుమ్రా నడిపిస్తాడు. బీసీసీఐ ఆగ్రహానికి గురై సెంట్రల్ కాంట్రాక్ట్ లను కోల్పోయిన ఇషాన్‌ కిషన్‌ లేదా శ్రేయస్‌ అయ్యర్​లో ఒకరికి జట్టులో స్థానం దక్కే ఛాన్స్ ఉంది. కేఎల్ రాహుల్ ఫామ్‌లో లేకపోవడం వల్ల అతడిని పక్కన పెట్టేస్తారని తెలుస్తోంది. కివీస్‌తో ఇంకా రెండు టెస్టుల్లో కేఎల్ మెరుగైన ప్రదర్శన చేస్తేనే పరిగణనలోకి తీసుకుంటారు. వాటిలో విఫలమైతే రాహుల్ పై వేటు తప్పదు.

షమీ రీఎంట్రీ!
పేసర్లకు అనుకూలంగా ఆసీస్ పిచ్​లు ఉంటాయి. అక్కడ స్పెషలిస్ట్‌ స్పిన్నర్ల అవసరం చాలా తక్కువనే చెప్పాలి. ఇప్పుడు మనకు స్పిన్‌ ఆల్‌ రౌండర్లు ఉండటం కలిసొచ్చే అవకాశం ఉంది. కుల్దీప్​ను తీసుకోవాల్సిన పనిలేదు. జడేజా/అక్షర్ పటేల్‌/ వాషింగ్టన్ సుందర్‌లో ఒకరు, అశ్విన్‌తో స్పిన్‌ విభాగాన్ని నడిపేయవచ్చు. సీనియర్ బౌలర్‌కు ఎలాగూ ఆసీస్‌పై మంచి రికార్డే ఉంది.

ఇక పేసర్ల విషయానికొస్తే ముగ్గురు కచ్చితంగా తుది జట్టులో ఉండాల్సిందే. బుమ్రాతో కలిసి పేస్‌ విభాగంలో ఉండేవారిపై ఆసక్తిగా ఉంది. స్టార్‌ పేసర్ షమీ కోలుకుని వచ్చాడని సంబరపడుతున్న వేళ మోకాలి గాయం మళ్లీ తిరగబెట్టింది. దీంతో కివీస్‌తో టెస్టు సిరీస్‌కు షమీని ఎంపిక చేయలేదు. తాజాగా అతడు బౌలింగ్ ప్రాక్టీస్‌ చేస్తున్నాడనే వార్తలు అభిమానులకు ఊరటనిచ్చాయి.

ఇంకా నెల రోజుల సమయం ఉండటంతో అతడిని స్క్వాడ్‌లోని తీసుకొని, మ్యాచ్‌ సమయానికి ఫిట్‌నెస్‌ సాధిస్తే తుది జట్టులో ఆడించే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం బుమ్రాతో కలిసి సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌ బౌలింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ లెఫ్ట్‌ఆర్మ్‌ పేసర్ కావాలనుకుంటే మాత్రం యువ బౌలర్ అర్ష్‌దీప్‌ను తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే, కనీసం నలుగురు పేసర్లు ఉంటేనే ఆసీస్‌ను అడ్డుకోవడం ఈజీ అవుతుంది. అలా జరగాలంటే కచ్చితంగా ‘పేస్‌ ఆల్‌రౌండర్’ ఉండాల్సిందే.

పేస్‌ ఆల్‌రౌండర్లు?
ఏ టీమ్ కైనా ఆల్ రౌండర్లు చాలా కీలకం. భారత్‌కు పేస్‌ కంటే స్పిన్ ఆల్‌రౌండర్లు ఎక్కువని అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో పేస్‌ ఆల్‌రౌండర్లూ వస్తున్నారు. వన్డేలు, టీ20ల్లో ప్రభావం చూపిస్తున్నారు. కానీ, టెస్టుల్లో మాత్రం ఆ లోటు కాస్త వెలితిగానే ఉంది. గతంలో శార్దూల్ ఠాకూర్ సరిపోతాడని అంచనా వేశారు. కానీ, అతడు విఫలమై నిరాశపరిచాడు. ఇప్పుడు మళ్లీ రేసులోకి వచ్చాడు. కెరీర్‌ ఆరంభంలో టెస్టులు ఆడిన హార్దిక్‌ పాండ్య పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమయ్యాడు. ఇటీవల ఎర్ర బంతితో ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. గంభీర్‌, రోహిత్ కూడా పాండ్య వస్తే బాగుంటుందనే వ్యాఖ్యలూ చేశారు. కానీ, టెస్టుల్లోకి వస్తానని మాత్రం హార్దిక్‌ ఎక్కడా ధ్రువీకరించలేదు.

తెలుగు తేజంపై దృష్టి
ఈ క్రమంలో తెలుగు తేజం నితీశ్ కుమార్‌ రెడ్డి జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి 'పేస్‌ ఆల్‌రౌండర్' పాత్రకు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా Aతో తలపడబోయే భారత్ A జట్టుకు అతడు ఎంపికయ్యాడు. మీడియం పేస్‌తోపాటు మిడిలార్డర్‌లో నాణ్యమైన ఆటతీరు కనబరుస్తూ మేనేజ్‌మెంట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

ఒకవేళ పాండ్య సిద్ధంగా లేకున్నా, శార్దూల్‌ వైపు బీసీసీఐ ఆసక్తి చూపించకపోయినా నితీశ్ కుమార్‌ బెస్ట్‌ ఆప్షన్‌ అవుతాడనేది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. నిలకడగా 130 కి.మీ. వేగంతో బంతులు వేస్తూ, బ్యాటింగ్‌లోనూ నితీశ్ కుమార్‌ అదరగొడుతున్నారు. అంతే కాకుండా నితీశ్ కుమార్ మంచి ఫీల్డర్ కూడా. ఇది కూడా ఆయనకు కలిసొచ్చే అంశమనే చెప్పాలి.

ఆసీస్‌ పర్యటనకు భారత జట్టు(అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్‌ ఖాన్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్/రుతురాజ్‌ గైక్వాడ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్‌ జురెల్ (వికెట్ కీపర్), నితీశ్‌ కుమార్‌ / హార్దిక్‌ పాండ్య, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, సిరాజ్‌/షమీ, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ: 'షమీకి బదులు ఆ బౌలర్​కు ఛాన్స్ ఇవ్వాలి- అతడు కంప్లీట్ ప్యాకేజీ!'

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ: రోహిత్ దూరమైతే కెప్టెన్​గా ఛాన్స్​ ఎవరికో?

ABOUT THE AUTHOR

...view details