Rohit Sharma Speech Australia Parliament : బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు విజయంతో టీమ్ఇండియా ఊపుమీద ఉంది. ఇదే జోరులో రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించాలన్న కసితో ప్లేయర్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే రెండో టెస్టుకు ముందు టీమ్ఇండియా ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ప్రైమ్ మినిస్టర్ XI vs భారత్ A జట్ల మధ్య నవంబర్ 30న మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా ఆటగాళ్లకు ఆస్ట్రేలియా ప్రధాని అంథనీ అల్బనీస్ గురువారం ఆ దేశ పార్లమెంట్లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చాడు.
ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలను కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసించాడు. ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానుల స్ఫూర్తి, పోటీతత్వం బాగుంటుందని అన్నాడు. అందుకే ప్రపంచ క్రికెట్లో ఏ జట్టైనా ఆస్ట్రేలియాకు వచ్చి సిరీస్ ఆడేందుకు ఇష్టపడుతుందని పేర్కొన్నాడు. 'భారత్- ఆస్ట్రేలియా మధ్య ఎన్నో ఏళ్లుగా క్రీడా, వాణిజ్యంలో సత్ససంబంధాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాకు వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడడాన్ని మేం ఆస్వాదిస్తాం. అదే సమయంలో ఆసీస్‌లో ఆడటం కఠిన సవాళ్లతో కూడుకున్నదే. గతంలోనూ విజయవంతంగా సిరీస్‌లను ముగించాం. ఈసారి ఇక్కడికి రావడంతోనే శుభారంభం చేశాం'
'అదే జోష్‌ను పర్యటన ఆసాంతం కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం. దేశంలోని విభిన్న సిటీలకు వెళ్లడం మంచి అనుభవం. మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు సర్. నాణ్యమైన క్రికెట్‌తో మిమ్మల్ని సంతోషపెడతాం. ఇలాంటి గొప్ప ప్రదేశానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. ఇరు దేశాల క్రికెట్ పోటీని ఆస్వాదిస్తారని భావిస్తున్నాం' అని రోహిత్ పేర్కొన్నాడు. ప్రస్తుతం రోహిత్ స్పీచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ వైరల్‌గా మారింది.