India At Paris Olympics 2024 :ఈ ఏడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల పోరాటం యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఈ సారి విశ్వక్రీడల్లో భారత్ తరఫున 16 క్రీడాంశాల్లో 117 మంది పోటీపడ్డారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఐదు కాంస్యాలు, ఒక రజత పతకాలు భారత్ కు దక్కాయి. పతకాల సంఖ్య తక్కువగానే ఉన్న ఈ ఒలింపిక్స్ లో మనోళ్లు పలు కొత్త రికార్డులు నెలకొల్పి చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో 2024లో పారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటిన అథ్లెట్లు, వారు నెలకొల్పిన రికార్డులపై ఓ లుక్కేద్దాం పదండి.
అథ్లెటిక్స్‌లో ఒక్కడే
టోక్యో ఒలింపిక్స్ 2020లో స్వర్ణం సాధించిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్‌లో రజత పతకం దక్కించుకున్నాడు. దీంతో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో వరుసగా రెండు పతకాలు సాధించిన రెండో భారతీయుడిగా నీరజ్ రికార్డు సృష్టించాడు. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో 89.45 మీటర్ల దూరం బల్లేన్ని విసిరాడు నీరజ్. కానీ అనూహ్యంగా పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌ను(92.97 మీటర్లు) మాత్రం దాటలేకపోయాడు. దీంతో స్వర్ణాన్ని అర్షద్ ఎగరేసుకుపోగా, నీరజ్ రజతంతో సరిపెట్టుకున్నాడు.
చరిత్ర సృష్టించిన మను బాకర్
పారిస్ ఒలింపిక్స్ లో షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మను బాకర్ కాంస్య పతకం దక్కించుకుంది. దీంతో విశ్వక్రీడల్లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా రికార్డు సృష్టించింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ సరబ్ జ్యోత్తో కలిసి కాంస్యం సాధించిన మను స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచింది. అలాగే మహిళల 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్లో నాలుగో స్థానంలో నిలిచిన మను బాకర్ త్రుటిలో కాంస్యాన్ని చేజార్చుకుంది.
అత్యధికంగా ఒకే విభాగంలో మూడు పతకాలు
షూటర్ స్వప్నిల్ కుశాలె 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో కాంస్య పతకం అందుకున్నాడు. భారత్ ఒక ఒలింపిక్స్‌లో ఒకే క్రీడాంశంలో మూడు పతకాలు అందుకోవడం కూడా మొదటిసారి కావడం విశేషం. ఇదే షూటింగ్ విభాగంలో మనుబాకర్ రెండు పతకాలు గెలుచుకుంది.
52 ఏళ్ల తర్వాత
పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం గెలుచుకుంది. దీంతో విశ్వక్రీడల్లో హాకీలో భారత్ పతకాల సంఖ్య 13కి చేరింది. భారత జట్టు 52 ఏళ్ల తర్వాత హాకీలో వరుసగా కాంస్య పతకాలు సాధించడం ఇదే తొలిసారి. అంతకు ముందు 1968, 1972లో టీమ్ఇండియా మూడో స్థానంలో నిలిచింది.
పిన్న వయస్కుడిగా అమన్
పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల విభాగంలో పోటీ పడిన ఏకైక రెజ్లర్ అమన్ సెహ్రావత్. తిరుగులేని ఆటతో ఆశలు రేపినా అతడు సెమీస్‌లో భంగపడ్డాడు. చివరకు కాంస్య పతకం సాధించి రెజ్లింగ్ లో ఈ సారి భారత్ కు పతకాన్ని అందించాడు.